Karnataka Anti Conversion Bill: వివాదాస్పద 'మతమార్పిడి వ్యతిరేక బిల్లు'ను కర్ణాటక అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీయూ తీవ్ర నిరసన తెలిపాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
'మేమంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారమే. దేశాన్ని రక్షించాలని ఆర్ఎస్ఎస్ చెబుతుంది. ఈ దేశ సంస్కృతిని, మతాలను పరిరక్షించాలని ఆకాంక్షిస్తుంది. అందుకే మేము ఈ బిల్లును తీసుకొచ్చాము.' అని సభలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఈశ్వరప్ప అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుబట్టింది.
ఓటు బ్యాంకు రాజకీయాలు ..
Karnataka Anti Conversion Bill Passed: కాంగ్రెస్‌పై అధికార భాజపా విరుచుకుపడింది. సిద్ధరామయ్య హయాంలోనే 2016లో ఈ బిల్లును తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆరోపించింది. సమాజ క్షేమం కోసమే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. భాజపా ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. ఈ బిల్లు వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆరోపించారు.
What is Anti Conversion Bill:
'కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు-2021'పేరిట తీసుకువచ్చిన ఈ బిల్లు ద్వారా బలవంతపు మత మార్పిళ్లను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 భారతీయ పౌరులు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు హక్కును కల్పిస్తోంది. అయితే, బలవంతపు మార్పిళ్లను నిషేధిస్తోంది. ఈ నిబంధనకు లోబడి.. బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించనుంది కర్ణాటక ప్రభుత్వం.
కొత్త బిల్లు ప్రభారం బలవంతంగా, బెదిరించి మత మార్పిడికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గంలోని మహిళలు, మైనర్లు, బధిరులను మతమార్పిడి చేస్తే కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే, ఇతర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులను మతం మారేలా ప్రేరేపిస్తే.. గరిష్ఠంగా 5 ఏళ్ల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు. సామూహిక మత మార్పిళ్లు చేస్తే.. 3-10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో డబ్బులు, కానుకలు, ఉపాధి, ఉచిత విద్య, వివాహాలు, మంచి జీవన విధానం వంటివి చూపించి ఆకర్షించే ప్రయత్నాలను సైతం నేరంగా పరిగణించనున్నారు. ఇలాంటి వాటిలో పాల్గొనే ఎన్జీఓలు, మతపరమైన మిషనరీలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, విద్యా సంస్థలకు నిధులను నిలిపివేయనున్నారు. బలవంతపు మత మార్పిడి ఏ విధంగా జరిగినా నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. మతమార్పిడి నిరూపితమైతే.. బాధితుడికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ తరహా చట్టాన్ని అమల్లోకి తెచ్చాయి.