అమ్మో! పోలీస్ స్టేషన్కా? అక్కడికి వెళ్లాల్సివస్తే ఎవరి స్పందన అయినా ఇదే. కానీ, ఓ మహిళ అయితే ఏకంగా పోలీస్ స్టేషన్లోనే నివాసముంటోంది. పోలీసులే ఆమె కుటుంబ సభ్యులు. నాలుగు దశాబ్దాల క్రితం.. కర్ణాటకలోని మంగళూరు రైల్వే స్టేషన్లో పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అనాథగా కనిపించింది ఈ మహిళ. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఆ యువతి వినలేదు, మాట్లాడలేదు. ఆ పరిస్థితుల్లో ఆమెను అక్కడే వదిలేయడం ఇష్టం లేక.. ఓ పోలీసు అధికారి స్టేషన్‌కు తీసుకొచ్చి, హొన్నమ్మ అని పేరుపెట్టారు.
"హొన్నమ్మ మా పోలీస్ స్టేషన్లో దాదాపు 30 ఏళ్ల నుంచి ఉంటోంది. స్టేషన్లో జరిగే అన్ని పనుల్లో సహాయం చేస్తుంది. చాలామంది పోలీసు అధికారులు వచ్చారు, వెళ్లారు. కానీ ఈ స్టేషన్‌తో హొన్నమ్మకు ఓ అనుబంధం ఏర్పడింది."
- గోవిందరాజు, ఇన్స్పెక్టర్
స్టేషన్ పనుల్లో సాయపడుతూ..
ఆమె తల్లిదండ్రులు, చిరునామా సహా ఇతర వివరాలు కనుక్కునే ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది. అందుకే ఆమెకు పోలీస్ స్టేషన్లోనే ఆశ్రయం కల్పించాలని నిర్ణయించారు పోలీసులు. చిన్న చిన్న పనుల్లో సహాయం చేయమని సూచించారు. స్టేషన్ను శుభ్రపరచడం సహా.. ఇతర పనులూ చేస్తోంది. స్టేషన్ను ఆనుకుని ఆమె కోసం ఓ చిన్న గది కూడా నిర్మించారు.
"ఈ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అధికారులు, సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. కానీ, హొన్నమ్మ ఈ స్టేషన్లో శాశ్వత సభ్యురాలు. ఇక్కడ జరిగే ప్రతిదీ ఆమెకు తెలుసు. ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో, నీటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందో, వాల్వుల ఆన్,ఆఫ్‌లు సహా.. ఇతర పనులన్నీ ఆమెకు తెలుసు."
- గోవిందరాజు, ఇన్స్పెక్టర్