తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో ఏసీ పేలుడు.. మహిళ, ఇద్దరు చిన్నారులు సజీవదహనం.. మాజీ ప్రియుడి దారుణ హత్య

ఇంట్లో ఏసీ పేలి.. ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, కొత్త బాయ్​ఫ్రెండ్​తో కలిసి మాజీ ప్రియుడిని హత్య చేసింది ఓ మహిళ.

Karnataka AC explosion
Karnataka AC explosion

By

Published : Mar 7, 2023, 9:59 AM IST

ఇంట్లో ఉన్న ఏసీ పేలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని రాయచూర్​లో జరిగింది. మృతులంతా సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. శక్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం ఏసీ ఒక్కసారిగా పేలి పోయింది. అనంతరం గది మొత్తం భారీగా మంటలు వ్యాపించాయి. ఘటన సమమయంలో గదిలో ఉన్న రంజిత (33), ఆమె ఇద్దరు సంతానం మృదల (13), తరుణ్య (5).. మంటల ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఏసీ పేలుడు తీవ్రత

ఘటన గురించి సమాచారం అందుకున్న రాయచూర్ డీఎస్పీ, శక్తినగర్ పీఎస్ఐ.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోలీసులు మార్చురీకి తరలించారు. మృతురాలు రంజిత, ఆమె భర్త సిద్ధలింగయ్య మండ్య జిల్లాకు చెందినవారని సమాచారం. ఈ ప్రమాదం గురించి రంజిత కుటుంబానికి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేసుకోలేదని అన్నారు. రంజిత కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పేలుడు ధాటికి కాలిపోయిన వస్తువులు

మాజీ ప్రియుడి హత్య
కొత్త బాయ్​ఫ్రెండ్​తో కలిసి మాజీ ప్రియుడిని కిరాతకంగా హత్య చేసింది ఓ మహిళ. మాజీ ప్రియుడికి మద్యం తాగించి ఈ దారుణానికి పాల్పడింది. బంగాల్​, దుర్గాపుర్​లోని గోపాల్​మఠ్​లో ఈ దారుణం జరిగింది. నిందితులు బిట్టు కుమార్ సింగ్, అతడి గర్ల్​ఫ్రెండ్ అఫ్రీన్ ఖాతున్​ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను నిందితుల నుంచి రాబట్టారు.

ఏమైందంటే?
అఫ్రీన్​కు అవినాశ్ ఝాన్ (19) అనే బాయ్​ఫ్రెండ్ ఉన్నాడు. ఇటీవల బిట్టు కుమార్​తో అఫ్రీన్​కు పరిచయం ఏర్పడింది. దీంతో అఫ్రీన్.. అవినాశ్​కు దూరం జరుగుతూ వచ్చింది. తనను వదిలిపెట్టాలని అవినాశ్​కు చెప్పింది. కానీ, అందుకు అవినాశ్ ఒప్పుకోలేదు. దీంతో కొత్త లవర్ కోసం.. పాత బాయ్​ఫ్రెండ్​ను వదిలించుకోవాలని అఫ్రీన్ ప్లాన్ వేసింది. ఏకంగా ఈ ప్రపంచం నుంచి దూరం చేయాలని భావించింది. బిట్టు కుమార్​తో కలిసి హత్యకు పథకం రచించింది. ఒకరోజు అవినాశ్​ను బిజుపారాలోని బిట్టు ఇంటికి పిలిచింది. బిట్టును అవినాశ్​కు పరిచయం చేసింది. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం అవినాశ్​ను దారుణంగా కొట్టారు. తొలుత అఫ్రీన్.. అతడి తలపై రాడ్డుతో కొట్టింది. మరోవైపు, బిట్టు సైతం అవినాశ్ తలపై మద్యం సీసాను పగులగొట్టాడు. అవినాశ్ స్పృహ కోల్పోగా.. పూర్తిగా ప్రాణాలు కోల్పోయేలా చేసేందుకు తలపై గ్లాస్​తో కొట్టాడు బిట్టు. చివరకు అతడు ప్రాణాలు విడిచాడు.

ఈ హత్యను కప్పిపుచ్చేందుకు అఫ్రీన్, బిట్టు విఫల ప్రయత్నాలు చేశారు. అవినాశ్ శరీరాన్ని కనిపించకుండా చేయాలని అనుకున్నారు. తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసి మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లారు. బిట్టు బైక్ నడుపుతుంటే.. మృతదేహాన్ని మధ్యలో పెట్టుకొని అఫ్రీన్ వెనక కూర్చుంది. చివరకు.. అవినాశ్ మృతదేహాన్ని బుధవారం అర్ధరాత్రి ఓ జాతీయ రహదారి పక్కన పడేశారు.

గురువారం ఉదయం అవినాశ్ మృతదేహం దుర్గాపుర్​లోని గోపాల్​మఠ్ హైవేపై పోలీసులకు లభ్యమైంది. అవినాశ్ కుటుంబం బెనాచిటి నహాపల్లి ప్రాంతంలో నివసిస్తున్నారు. వారికి ట్రాన్స్​పోర్ట్ బిజినెస్ ఉంది. అవినాశ్ మృతికి.. అఫ్రీన్ కారణమై ఉంటుందని అతడి కుటుంబ సభ్యులు అనుమానించారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. అఫ్రీన్, బిట్టులను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details