Donkey milk farm: అందరికీ విభిన్నంగా ఆలోచించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు శ్రీనివాస గౌడ. సాఫ్ట్‌వేర్ కొలువును వదులుకుని.. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లి జూన్ 8వ తేదీన గాడిదలను పెంచేందుకు వ్యవసాయ క్షేత్రాన్ని తెరిచారు. కర్నాటకలో గాడిదలను పెంచడం ఇదే మొదటిది కాగా.. దేశంలో ఇది రెండవది. గతంలో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో గాడిదల పెంపకం కోసం ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు.
బీఏ పట్టభద్రుడైన శ్రీనివాస గౌడ 2020లో ఐటీ ఉద్యోగం మానేసిన తర్వాత ఇరా గ్రామంలో.. 2.3 ఎకరాల స్థలంలో సమగ్ర వ్యవసాయం, పశుసంవర్ధక, పశువైద్య సేవలు, శిక్షణ, పశుగ్రాసం అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ క్షేత్రంలోనే మేకల పెంపకాన్ని ప్రారంభించారు. అనంతరం కుందేళ్లు, కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. తాజాగా 20 గాడిదలతో వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు.