Kargil Vijay Diwas : భారత్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు నియంత్రణ రేఖను దాటేందుకు సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అటువంటి పరిస్థితిలో సైనికులకు మద్దతు ఇవ్వడానికి దేశ పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి రాజ్‌నాథ్ పరోక్షంగా ఉదహరించారు. ఆ దేశ పౌరులు యుద్ధంలో పాల్గొనడం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా జరుగుతోందని చెప్పారు.
"భారత్‌కు పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచింది. దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు సెల్యూట్. యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా.. భారత ప్రజలు సైనికులకు మద్దతు ఇచ్చారు. కానీ ఆ మద్దతు పరోక్షంగా ఉంది. అవసరమైతే యుద్ధ రంగంలో నేరుగా సైనికులకు మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలి. దేశ గౌరవాన్ని కాపాడుకోవడం నియంత్రణ రేఖను దాటడానికి భారత్ సిద్ధంగా ఉంది"
-- రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ మంత్రి
Rajnath Singh Kargil : అంతకుముందు..కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లద్ధాఖ్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద నివాళుర్పించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులను గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక వీరులకు వందనమని అన్నారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులతో రాజ్‌నాథ్ కలిశారు. వారికి శాలువా, జ్ఞాపికను అందజేశారు.
'వారు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం'
PM Modi On Kargil war : 24వ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరవీరులకు నివాళులర్పించారు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో అత్యున్నత త్యాగం చేసిన సైనికుల సేవలను గుర్తు చేసుకున్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారతదేశ యోధుల ధైర్యాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని అన్నారు. ఆ అమరవీరులు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
'భవిష్యత్ తరాలకు సైనికుల పరాక్రమం స్ఫూర్తి'
Rahul Gandhi Kargil : కార్గిల్ యుద్ధంలో దేశం కోసం మరణించిన సైనికులకు కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం కోసం మరణించిన సైనికుల పరాక్రమం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొంది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. జవాన్లు, వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దును కాపాడుతూ అత్యున్నత త్యాగం చేసిన వీర సైనికులందరికీ వందనాలని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశం ఎల్లప్పుడూ వీర సైనికులకు రుణపడి ఉంటుందని ట్వీట్ చేశారు.
దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు..
తమ ప్రాణాలను త్యాగం చేసి కార్గిల్ యుద్ధంలో దేశ విజయానికి బాటలు వేసిన యోధులకు ప్రణామాలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. సాయుధ బలగాలు అసాధారణ పరాక్రమంతో సాధించిన విజయాన్ని దేశ ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారని ముర్ము ట్వీట్ చేశారు.
'సిద్ధంగా ఉండాలి'
సాయుధ బలగాల ముందున్న సవాళ్లు భవిష్యత్తులో మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కోరారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన అమరవీరులకు లద్ధాఖ్ ద్రాస్‌లోని యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అలాగే పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులర్పించారు.
పాక్‌ను మట్టికరిపించిన భారత్..
1999 దురాక్రమణలకు పాల్పడ్డ దాయాది పాక్‌ను.. రణక్షేత్రంలో మట్టికరిపించి తిరిగి మన భూభాగాల్ని భారత్ సొంతం చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం తెగువకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన పాక్ తోకముడిచింది. అక్రమంగా తిష్టవేసిన ప్రాంతాలను తిరిగి అప్పగించింది.