Karataka local polls: కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 58 అర్బన్ లోకల్ బాడీస్, 57 గ్రామ పంచాయతీలు, 9 వార్డుల(ఉపఎన్నికలు)కు సోమవారం పోలింగ్ జరగగా.. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 1,184 వార్డుల్లో.. కాంగ్రెస్ 501 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 433 స్థానాల్లో విజయం సాధించింది. జేడీఎస్ 45 స్థానాలకు పరిమితమైంది.
సీఎంకు షాక్..
Congress in karnatka local polls: ఈ ఎన్నికల్లో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి భారీ షాక్ తగలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హవేరీ జిల్లా షిగ్గావి నియోజకవర్గ పరిధిలోని బంకరపుర మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ 14 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. భాజపా 7, స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించారు. ఇదే తరహాలో గుత్తాలా నగర మన్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయింది.
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి భాజపా, కాంగ్రెస్‌కు మధ్య రసవత్తర పోరు కొనసాగింది.
'డబ్బులతో అధికారాన్ని కొనలేరు'
Bjp in karnataka: భాజపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని ఈ ఎన్నికల్లో నిరూపితమైందని... ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. డబ్బుతో అధికారాన్ని కొనుగోలు చేయలేరనే విషయాన్ని కూడా ఈ ఫలితాలు చాటాయని చెప్పారు.
"ఇది కాంగ్రెస్‌తోపాటు ప్రజలు సాధించిన విజయం. గ్రామీణ ప్రాంత ప్రజలే కాదు.. పట్టణ ప్రాంతాల్లోని వారు కూడా కాంగ్రెస్‌ను నమ్మతున్నారనేందుకు నిదర్శనం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్కొన్నారు.
'సంతోషపడొద్దు..'
అయితే.. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న కొన్ని కార్పొరేషన్ సీట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిందని చెప్పారు. "ఈ మాత్రం దానికే కాంగ్రెస్ సంతోషపడొద్దు. గ్రామ పంచాయతీల్లో ఎక్కువ స్థానాలను భాజపా గెలిచింది. నగరాల్లోనూ ఇదే తరహా ఫలితాలు వెలువడ్డాయి. భాజపా 2023లో మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఇందుకు సిద్ధరామయ్య, కాంగ్రెస్ బాధపడొద్దు" అని చెప్పారు.
'25 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టినట్లుగా..'
కాంగ్రెస్ పార్టీ ఆనందాన్ని చూస్తోంటే... పెళ్లైన 25 ఏళ్ల తర్వాత పిల్లలు పట్టిన తల్లిదండ్రుల్లా అనిపిస్తోందని కర్ణాటక మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప విమర్శించారు. భాజపా గెలుపొందిన చోట అభివృద్ధి పనులను తాము మరింత ముందుకు తీసుకువెళతామని చెప్పారు.
భాజపాకు కంచుకోటగా ఉన్న విజయపుర జిల్లాలో మొత్తం ఆరు నగర మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా.. అందులో మూడింట్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బెల్గాం జిల్లాలోనూ కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది.
'ప్రతిసెకనూ ఆటంకమే..'
ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బొమ్మై ప్రభుత్వంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా తీవ్ర విమర్శలు చేశారు. మోసపూరిత, అవినీతిమయమైన బొమ్మై ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి సెకను కూడా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన కన్నడ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీ చూడండి:అరుణాచల్‌లో మరో 15 ప్రాంతాలకు చైనా నామకరణం!
ఇదీ చూడండి:ఎన్నికల వేళ ఫారిన్ టూర్.. భాజపాకు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన రాహుల్!