Kapu Movement Leader Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైఎస్సార్సీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే తెలుగుదేశం, జనసేన నేతలతో సమావేశమైన ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీ నేతలు వస్తామంటే మాత్రం విముఖత చూపినట్లు సమాచారం. దీంతో ముద్రగడ జనసేనలో చేరనున్నారనే ప్రచారం బలంగా సాగుతోంది.
ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరుతారన్న ప్రచారం ఇన్నాళ్లు జోరుగా సాగింది. అయితే కాకినాడ జిల్లా కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు ఆ ప్రచారాన్ని పటాపంచలు చేశాయి. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు.
మరోవైపు గురువారం ఉదయం తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొంత మంది నేతలు ముద్రగడతో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అయితే జగ్గంపేట మండలం ఇరుపాకలో కోటి శివలింగార్చనకు ముద్రగడను ఆహ్వానించడానికి మాత్రమే వెళ్లానని నెహ్రూ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని సహకారం ఇవ్వాలని కోరితే మద్దతు తెలుపుతానని ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ వెల్లడించారు.
వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది - అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది: పవన్