పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ (Kapil Sibal news) మరోసారి సంస్కరణలపై గళమెత్తారు. గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసిన నేతలు (G23 Congress) ఇప్పటికీ చర్యల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎన్నికలపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు అధ్యక్షులు లేరని పేర్కొన్నారు సిబల్. ఇలాంటప్పుడు నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు. తెలిసినా.. అది తెలియని విషయం వంటిదేనని చెప్పుకొచ్చారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇలాంటి పరిస్థితులు (Punjab Congress Crisis) మంచిది కాదని తెలిపారు. జీ23 నేతలు (G23 Congress list) పార్టీని వీడే వ్యక్తులు కాదని స్పష్టం చేశారు.
"సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నా సీనియర్ సహచరులు కాంగ్రెస్ అధ్యక్షురాలిని సంప్రదిస్తారని అనుకుంటున్నా. అప్పుడే.. కాంగ్రెస్ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉందనే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. సరిహద్దు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితులు (Punjab Congress Crisis) ఎదురవుతున్నాయంటే.. అది కచ్చితంగా ఐఎస్ఐ, పాకిస్థాన్‌కు ప్రయోజనకరమే. పంజాబ్ చరిత్ర గురించి, అక్కడి తీవ్రవాదం గురించి మనకు తెలుసు. కాంగ్రెస్ ఇక్కడ ఐక్యమత్యంగా ఉండాలి.
మేం (జీ23 నేతలు) పార్టీ వీడే వ్యక్తులం కాదు. మేం కాంగ్రెస్‌ను విడిచి ఎక్కడికీ వెళ్లేది లేదు. తమకు (అధిష్ఠానానికి) సన్నిహితులుగా భావిస్తున్న నేతలే పార్టీని విడిచి వెళ్తున్నారు. మా వాళ్లు కాదని అనుకుంటున్న వారే.. ఇప్పటికీ వారి వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏకస్వామ్యం ఉండకూడదు. పార్టీ పరిస్థితి పై అంతర్గతంగా చర్చలు జరగాలి. పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీకి వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటాను."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత