Kanpur Raids Piyush Jain: పన్ను ఎగవేసి వందల కోట్ల రూపాయల అక్రమ నగదుతో పట్టుబడ్డ కాన్పుర్ వ్యాపారవేత్త పీయూష్ జైన్ జీఎస్టీ అధికారుల ముందుకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు. సీజ్ చేసిన నగదులో పన్ను, జరిమానా కింద రూ.52 కోట్లు తీసుకొని మిగతా డబ్బు తిరిగివ్వాలని కోరాడు. ఈ మేరకు కోర్టులో అధికారులు వెల్లడించారు.
జైన్ కేసులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రిష్ టాండన్ కోర్టులో వాదనలు వినిపించారు. పన్ను ఎగవేశానని జైన్ ఒప్పుకున్నారని, రూ.52కోట్లు పెనాల్టీగా చెల్లించాల్సి ఉందని అంగీకరించాలని వివరించారు.
అయితే జైన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ నివాసాల్లో సీజ్ చేసిన నగదులో రూ.52కోట్లు పెనాల్టీగా తీసుకొని మిగతా డబ్బును మొత్తం తిరిగి ఇవ్వాలని డీజీజీఐని ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందించిన అమ్రిష్ టాండన్.. పన్ను ఎగవేత కింద సీజ్ చేసిన డబ్బును తిరిగి ఇవ్వడం కుదరదని, కావాలంటే జైన్ అదనంగా మరో రూ.52కోట్లు పెనాల్టీగా చెల్లించాలని చెప్పారు. అందుకు DGGI అంగీకరిస్తుందని కోర్టుకు తెలిపారు.
Piyush Jain News
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పన్ను ఎగవేత ఆరోపణలతో జైన్ నివాసాల్లో ఇటీవలే సోదాలు జరిపిన జీఎస్టీ అధికారులు కుప్పలుకుప్పలుగా పడి ఉన్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 23కేజీల బంగారం, రూ.6 కోట్లు విలువ చేసే చందనం నూనెను జైన్ వద్ద గుర్తించారు. అనంతరం అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. జైన్ అరెస్టుపై ఉత్తర్ప్రదేశ్లో రాజకీయ దుమారం చెలరేగింది. భాజపా, ఎస్పీ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. అదే సమయంలో రికవరీ చేసిన డబ్బును టర్నోవర్ మొత్తంగా పేర్కొంటూ DGGI కేసును బలహీనం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.