తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాకు గర్ల్​ఫ్రెండ్​గా మారితే పరీక్షలో పాస్ చేస్తా'.. యువతికి ప్రపోజల్.. నో అనగానే మళ్లీ ఫెయిల్

ఫెయిల్ అయిన సబ్జెక్ట్​కు రీకౌంటింగ్ కట్టిన యువతికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి విచిత్ర ప్రతిపాదన వచ్చింది. పరీక్షలో పాస్ కావాలనుకుంటే.. డబ్బులు ఇవ్వాలని, తనకు గర్ల్​ఫ్రెండ్​గా మారాలని ఓ వ్యక్తి యువతికి మెసేజ్ చేశాడు. ఈ ప్రతిపాదనను తిరస్కరించగా.. మరోసారి సబ్జెక్ట్​లో ఫెయిల్ అయింది యువతి.

student-gets-girlfriend-offer
student-gets-girlfriend-offer

By

Published : Dec 20, 2022, 3:53 PM IST

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో ఓ యువతికి చిత్రమైన ప్రపోజల్ వచ్చింది. పరీక్షలో పాసయ్యేందుకు సహకరిస్తానని చెబుతూ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి యువతికి ఓ ప్రతిపాదన పెట్టాడు. 'నువ్వు నా గర్ల్​ఫ్రెండ్​ అయితే.. పరీక్షలో పాస్ చేస్తా' అంటూ యువతిని ప్రలోభపెట్టాడు. అంతేకాకుండా రూ.5వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీనికి యువతి నో చెప్పింది. దీంతో తరచుగా కాల్స్ చేస్తూ విసిగించడం మొదలుపెట్టాడు. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజెస్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

బాధిత యువతి మహరాజ్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తోంది. కాన్పుర్​లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటోంది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఆమె.. మ్యాథ్స్ సబ్జెక్ట్​లో ఫెయిల్ అయింది. కేవలం 11 మార్కులే వచ్చాయి. దీంతో ఆ సబ్జెక్ట్​కు రీకౌంటింగ్ కట్టింది యువతి. అయితే, నవంబర్​లో ఆమె మొబైల్ నంబర్​కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. పరీక్షలో పాస్ కావాలనుకుంటే.. నాకు రూ.5వేలు ఇవ్వు. నా గర్ల్​ఫ్రెండ్​గా మారు' అంటూ మెసేజ్​లో ఉంది. అయితే, ఆ వ్యక్తి చేసిన ప్రతిపాదనను యువతి తిరస్కరించింది.

తీరా రీకౌంటింగ్ ఫలితాలు చూసుకునే సరికి షాక్. మ్యాథ్స్ సబ్జెక్ట్​లో యువతి మళ్లీ ఫెయిల్ అయింది. గతంలో 11 మార్కులు రాగా.. రీకౌంటింగ్​లో సున్నా వచ్చాయి. ఇది తనకు కాల్ చేసిన వ్యక్తి పనే అన్న అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. గుర్తుతెలియని యువకుడు తనకు మళ్లీ కాల్ చేసి బెదిరించాడని యువతి వాపోయింది. తన భవిష్యత్​ను నాశనం చేస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details