కన్నడ నాట కొబ్బరి చెట్టును కల్పవృక్షమని పిలుచుకుంటారు. ఆ చెట్టే ఇప్పుడు తీరప్రాంత రైతులకు కామధేనుగా మారింది. 8 కొబ్బరి చెట్లను నాటుకుంటే చాలు.. ఏడాదిలో లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కుండాపురలో నీర ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇది రైతుల పాలిట వరంగా మారింది.
"రైతులకు తప్పకుండా వాళ్ల డబ్బు తిరిగి వచ్చేస్తుంది. 20 రూపాయలిస్తే, ఆ డబ్బు మళ్లీ ఆయనకు వస్తుంది. బాధలో ఉన్న వారికి ఈ పని కొంచెమైనా ఊరటనిస్తుంది. ఇతర పనులు చేసుకుంటూ ఉదయం 6 నుంచి 9 గంటలలోపు నీరను తీసి, అమ్ముకోవచ్చు. సాయంత్రాలు 5 నుంచి 7 గంటల వరకు మరోసారి ఈ పని చేసుకోవచ్చు. ఓవైపు వ్యవసాయం చేసుకుంటూనే నీర తీసే పనులు కూడా చేసుకుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు వంద శాతం ఉన్నాయి."
- మురళీధర్, రైతు నేత
కుండాపుర తాలూకాలోని, జాప్తి గ్రామంలో నీర ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు 14 మందికి ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. కొబ్బరిచెట్లు ఎక్కడం, కొబ్బరికాయపై డబ్బా పెట్టి, నీరను ఎలా తీయాలో వీరికి నేర్పిస్తున్నారు. ఒకరోజు పాటు దాన్ని ఎలా నిల్వచేయాలో కూడా మెళకువలు చెప్తారు. ఇప్పటికే వెయ్యికిపైగా రైతులు ఈ కేంద్రంలో సభ్యులుగా చేరారు. వచ్చే ఐదేళ్లలో 5 వేల మందికి పైగా రైతు కుటుంబాలకు ఈ సొసైటీలో సభ్యత్వం ఇప్పిచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్వాహకులు.
"నీరను తీయడం నుంచి, పంపిణీ దాకా.. కోల్డ్ చైన్ ద్వారానే జరుగుతుంది. వెండింగ్ మెషీన్ నుంచి, కప్పుల్లో వినియోగదారులకు అందిస్తాం."