సీపీఐ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కాంగ్రెస్ (Kanhaiya kumar Congress) తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని (Jignesh mevani congress) సైతం హస్తం పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరలేకపోతున్నట్లు మేవాని తెలిపారు. దిల్లీలోని రాహుల్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.
పార్టీ సభ్యత్వంపై సంతకాలు చేస్తున్న కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన కన్నయ్య కుమార్.. హస్తం పార్టీ పెద్ద నావలాంటిదని, దీన్ని కాపాడితే చాలా మంది ఆశయాలను కాపాడినట్లేనని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడాలంటే ముందుగా కాంగ్రెస్‌ను రక్షించాలని చెప్పారు. అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు.
"కాంగ్రెస్‌ను కాపాడితే.. మహాత్మా గాంధీ ఐక్యతా విధానాన్ని, అంబేడ్కర్ సమానత్వపు ఆలోచనను, భగత్ సింగ్ శౌర్యాన్ని కాపాడినట్లవుతుంది. ఈ దేశ భవిష్యత్‌ను, విలువలను, సంస్కృతిని, చరిత్రను ధ్వంసం చేసేందుకు ఓ భావజాలం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ను కాపాడితేనే దేశాన్ని కాపాడవచ్చని కోట్లాది మంది యువత భావిస్తున్నారు. అందుకే పార్టీలో చేరా."
-కన్నయ్య కుమార్, కాంగ్రెస్ నేత
చేరలేదు కానీ..
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బ్రిటీష్‌పై పోరాటం చేసిన పార్టీతోనే ఉండాల్సిన అవసరం ఉందని మేవాని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌తో కలిసినట్లు చెప్పారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో పార్టీలో అధికారికంగా చేరలేదని తెలిపారు.
"సాంకేతిక కారణాల వల్ల కాంగ్రెస్‌లో అధికారికంగా చేరలేకపోతున్నా. నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఏదైనా పార్టీలో చేరితే.. శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశం లేదు. భావజాలం ప్రకారం.. నేను కాంగ్రెస్‌లో భాగమే. వచ్చే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తా."
-జిగ్నేశ్ మేవాని, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా పనిచేసిన కన్నయ్య కుమార్ గత లోక్‌సభ ఎన్నికల ముందు సీపీఐలో చేరారు. బిహార్‌లోని బెగుసరాయి (Kanhaiya Kumar Begusarai) నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
మరోవైపు జిగ్నేశ్ మేవాని.. గుజరాత్‌లోని వడ్‌గాం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా దళిత నాయకుడు చరణ్ జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ నియమించిన నేపథ్యంలో.. ఇప్పుడు జిగ్నేశ్ చేరిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:కాంగ్రెస్‌కు మరో షాక్- పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా