తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana ranaut news) మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు అప్పట్లో గాంధీ(Kangana ranaut gandhi) నుంచి మద్దతు లభించలేదని పేర్కొన్నారు. ''ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలి'' అంటూ మహాత్మాగాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని ఆమె ఎద్దేవా చేశారు. ''అలా చేస్తే దక్కేది స్వాతంత్య్రం కాదు.. అది 'భిక్షే' అవుతుంది'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
''భారత్‌కు అసలైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చింది. 1947లో వచ్చింది కేవలం భిక్షే..'' అంటూ కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే ఆమె ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయగా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మళ్లీ అదే తరహా పోస్టులు పెట్టారు. 'నేతాజీని అప్పగించేందుకు గాంధీ (Kangana ranaut gandhi) తదితరులు అప్పట్లో అంగీకరించారు' అనే శీర్షికతో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ఆమె జత చేశారు.
''మీరు గాంధీ అభిమానిగానూ, నేతాజీ మద్దతుదారుగానూ ఉండలేరు. ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ హీరోలను తెలివిగా ఎంచుకోండి'' అని రనౌత్ పేర్కొన్నారు. మరో పోస్టులో - ''స్వాతంత్య్రం కోసం పోరాడే వారిని అణచివేతదారులకు అప్పగించేశారు. ఇలా అప్పగించినవారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవు.'' అని కంగన (Kangana ranaut news) వ్యాఖ్యలు చేశారు. ''ప్రజలు తమ చరిత్ర గురించి, హీరోల గురించి తెలుసుకోవాల్సిన సమయమిది.'' అని పోస్టుల్లో పేర్కొన్నారు.