Kambala Festival :కర్ణాటకలో కంబళ పోటీల సందడి మొదలైంది. కోస్తా కర్ణాటక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ పోటీలను.. మొదటిసారిగా బెంగళూరులో నిర్వహిస్తున్నారు. 'బెంగళూరు కంబళ - నమ్మ కంబళ' పేరుతో రెండు రోజులపాటు సాగనున్న ఈ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 200కిపైగా దున్నలతో జరుగుతున్న ఈ పోటీలు సోమవారంతో ముగియనున్నాయి.
ఏంటీ కంబళ పోటీలు?
కంబళ పోటీలు ఓ జానపద క్రీడ మాత్రమే కాదు.. కర్ణాటక తీరప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే ఆట. దీనిని ఎక్కువగా కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అక్కడి ప్రజలు దీనిని ఓ పండగలా జరుపుకుంటారు. అయితే ఈసారి ఈ పోటీలకు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ వేదిక కావడం విశేషం.
ఇదీ ప్రత్యేకత!
పోటీల్లో పాల్గొనే దున్నలకు రెండునెలల ముందే ప్రత్యేకంగా శిక్షణను ఇస్తారు. అంతేకాకుండా వాటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం రోజూ బీన్స్, క్యారెట్లు, బాదం పప్పు సహా వివిధ రకాల కూరగాయలతో పాటు ఎండుగడ్డిని ఆహారంగా తినిపిస్తారు. వీటి(దున్నల) శరీరాన్ని చల్లగా ఉంచేందుకు గుమ్మడికాయలను కూడా ఆహారం కింద అందిస్తారు. అంతేకాకుండా వారానికి మూడు సార్లు వాకింగ్, రన్నింగ్‌కు తీసుకువెళ్తారు. దీంతో పాటు నూనెతో బాడీ మసాజ్ చేస్తారు. చిన్నపాటి కొలనులు, చెరువుల్లో వీటికి ఈత నేర్పించి ప్రత్యేకంగా తర్ఫీదునిప్పిస్తారు.
ప్రత్యేకంగా జాకీలు..!
ఈ పోటీల్లో పాల్గొనే దున్నలతో పాటు ఓ వ్యక్తి(జాకీ) కూడా పరిగెత్తుతాడు. దున్నలను నియంత్రిస్తూ వేగంగా రేసును పూర్తి చేయడం వీరి లక్ష్యం. వీరు కూడా వాటి(దున్నల) సామర్థ్యానికి తగ్గట్లు ప్రత్యేక శిక్షణ, ఆహారం తీసుకుంటారు. ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. అయితే వీరికి అంతకుముందు కంబళ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి. వారిని మాత్రమే జాకీలుగా తీసుకుంటారు. ఇలాంటి జాకీలను తయారు చేయడానికి దక్షిణ కన్నడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, పోటీలు ప్రారంభం కంటే ముందు రెండు జంట దున్నలను చెక్కతో చేసిన ఓ వస్తువుకు కట్టేస్తారు. అనంతరం దానిని క్షేత్రంలోకి దింపుతారు.