చదవాలనే ఆసక్తి ఉంటే పేదరికం, కుటుంబ సమస్యలు ఏవీ అడ్డు రావని నిరూపించారు ఈ వ్యక్తి. ఉదయం కళాశాలకు వెళ్లి.. మధ్యాహ్నం విధులకు హాజరై.. రాత్రి పూట చదువుకున్నారు. చివరకు ఆయన అనుకున్నది సాధించారు. అంటెండర్‌గా పనిచేసిన కాలేజీకే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తిరిగి వచ్చారు. తాజాగా బిహార్ విశ్వవిద్యాలయ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఈ ఉద్యోగం సంపాదించారు.
బిహార్ భాగల్పుర్ ముండిచక్కు చెందిన కమల్ కిషోర్ మండల్‌కు చదువంటే ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు మానేసి నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. 42 ఏళ్లున్న కిషోర్‌కు 2003లో ముంగేర్ కాలేజీలో వాచ్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 2008లో అక్కడి నుంచి డిప్యుటేషన్‌పై అంబేడ్కర్ పీజీ కళాశాలకు అంటెండర్‌గా వెళ్లారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. పీజీ కళాశాలకు అంటెండర్‌గా వెళ్లిన కిషోర్.. విద్యార్థులు, ఉపాధ్యాయులను చూసి చదువుపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. 2013లో పీజీ పూర్తి చేశారు. 2017లో పీహెచ్‌డీలో పేరు నమోదు చేసుకున్నారు. 2019లో పీహెచ్డీ సైతం పూర్తి చేసి.. జాతీయ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు.
"2009లో పీహెచ్డీ చేస్తానని ఉన్నతాధికారులను కోరగా.. మూడేళ్ల తర్వాత 2012లో అనుమతి ఇచ్చారు. నా పేదరికం, కుటుంబ సమస్యలను చదువుకు అడ్డుకాలేదు. ఉదయం కళాశాలకు వెళ్లి తరగతులకు హాజరయ్యాను. మధ్యాహ్నం వచ్చి డ్యూటీ చేసేవాడిని. ఉదయం చెప్పిన విషయాలను రాత్రి తిరిగి చదువుకునేవాడిని."