Kamal Haasan Car Gift To Women Driver : ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తమిళనాడులోని కోయంబత్తూరు సిటీ తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిలకు స్టార్ నటుడు కమల్ హాసన్ అండగా నిలిచారు. డీఎంకే ఎంపీ కనిమొళిని బస్సు కండక్టర్ అవమానించిందన్న కారణంతో ఉద్యోగాన్ని వదులుకున్న ఆమెకు ఓ కారును కానుకగా ఇచ్చారు.
'కమల్ కల్చరల్ సెంటర్' తరఫున మహిళా బస్సు డ్రైవర్ షర్మిలకు కారును అందించినట్లు కమల్ హాసన్ తెలిపారు. ఆమె ఓ వ్యాపారవేత్తగా మారేందుకే ఇలా చేసినట్లు చెప్పారు. "ఇటీవలే షర్మిల చుట్టూ జరిగిన వివాదం గురించి తెలుసుకున్న ఆవేదన చెందాను. ఆమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి. షర్మిల కేవలం డ్రైవర్‌గానే ఉండకూడదు. ఎంతో మంది షర్మిలలను సృష్టించాలి. అందుకే కారును అందించాను. త్వరలోనే ఆమె వ్యాపారవేత్తగా మరుతుందని ఆశిస్తున్నాను" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివాదం ఏంటంటే?
Coimbatore First Female Bus Driver : షర్మిల గాంధీపురం నుంచి సోమనూర్ రూట్లో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం డీఎంకే ఎంపీ కనిమొళి తన అనుచరులతో కలిసి గాంధీపురం వద్ద షర్మిల నడుపుతున్న బస్సును ఎక్కారు. షర్మిలను అభినందించి, చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చారు. అదే సమయంలో బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న మరో మహిళ.. ఎంపీతో పాటు ఆమె అనుచరులను అవమానించిందని షర్మిల ఆరోపించింది. సొంత పబ్లిసిటీ కోసం ప్రముఖ వ్యక్తులను బస్సు ఎక్కాలని ఆహ్వానిస్తున్నట్లు యజమాన్యం తనను తిట్టినట్లు చెప్పింది షర్మిల. కనిమొళి వస్తారని యాజమాన్యానికి ముందే సమాచారం ఇచ్చానని తెలిపింది. మహిళా ఎంపీకి జరిగిన అవమానాన్ని తాను సహించకోలేకపోయానని చెప్పింది. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది.
బస్సు నడుపుతున్న షర్మిల (పాత చిత్రం)
First Female Bus Driver : అయితే షర్మిల.. కొద్ది రోజుల క్రితమే ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మట్లాడింది. తండ్రి సహాయంతోనే తాను డ్రైవింగ్ చేర్చుకున్నట్లు చెప్పింది. 2019 నుంచి కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నట్లు, అంతకుముందు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే వాహనం కూడా నడిపానని తెలిపింది. "వీవీ ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ వారు డ్రైవింగ్ టెస్ట్ పెట్టారు. దాంట్లో పాస్ అయ్యాను. దీంతో నన్ను డ్రైవర్‌గా ఎంపిక చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇది కష్టమైన పనే అయినప్పటికీ ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఉద్యోగం చేస్తున్నాను. డ్రైవర్ పని సులభమని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కష్టమైన పని. ఈ సీట్లో కూర్చుంటే ఈ పని ఎంత కష్టమో తెలుస్తుంది" అని చెప్పింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.