తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2021, 5:43 PM IST

ETV Bharat / bharat

వివాదాల సుడిలో కమల్- ఫలితమేంటి?

ప్రత్యామ్నాయ రాజకీయాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తానని హామినిచ్చి తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్​ హాసన్​.. ఇటీవలి కాలంలో వివాదాల వలయంలో చిక్కుకున్నారు. మరీ ముఖ్యంగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు డీఎంకే శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి. తన వివాదాస్పద వ్యాఖ్యలపై కమల్​ ఇస్తున్న సమాధానాలపైనా రాజకీయ నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. రాజకీయంగా కమల్​కు ఎదురవుతున్న వ్యతిరేకత ఎలాంటి ఫలితాన్నిస్తుందోనని సర్వత్రా చర్చనీయాంశమైంది.

Kamal - A Controversies' kid
వివాదాల వలయంలో కమల్​.. ఫలితమేంటి?

కమల్​ హాసన్... దిగ్గజ నటుడు. ఇప్పుడు రాజకీయ నేత. 'మార్పు' మంత్రంతో వచ్చిన మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత. తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

అయితే.. రాష్ట్రంలో మార్పు తెస్తానని, ప్రత్యామ్నాయ రాజకీయాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తానని హామీనిచ్చిన కమల్​.. ఇటీవలి కాలంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సాదాసీదా రాజకీయ నేత తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కమల్​ వ్యాఖ్యలతో పాటు వాటికి ఆయనిచ్చే వివరణలూ తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. మరి ఏప్రిల్​ 6న జరగనున్న ఎన్నికల్లో వీటి ప్రభావం ఏమేరకు ఉండనుంది?

కమల్​ హాసన్​

'చక్రాల కుర్చీ' రగడ

ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో భాగంగా కమల్​ హాసన్​ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 'చక్రాల కుర్చీ మీద కూర్చుని నేను ప్రజలకు సేవ చేయదలచుకోలేదు' అని​ అన్నారాయన.

తమిళనాడులో చక్రాల కుర్చీ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివంగత దిగ్గజ నేత కరుణానిధి. ఫలితంగా కమల్​పై డీఎంకే శ్రేణులు విరుచుకుపడ్డాయి. దివ్యాంగుడైన కరుణానిధి పట్ల కమల్​ తీరును సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్​ చేశారు. ఈ నేపథ్యంలో కమల్​ అభిమానులు- డీఎంకే కార్యకర్తల మధ్య ట్విట్టర్​లో మాటల యుద్ధం నడిచింది.

ఎన్నికల ప్రచారంలో కమల్

ఇదీ చూడండి:-కమల్​ వాహనంలో ఫ్లయింగ్​ స్క్వాడ్​ సోదాలు

అయితే దీనిపై కమల్​ స్పష్టతనిచ్చారు. తాను ఆ మాటలు కరుణానిధిని దృష్టిలో పెట్టుకుని అనలేదని స్పష్టం చేశారు. కరుణానిధి చక్రాల కుర్చీని లాగిన వారిలో తానూ ఒకరినని చెప్పారు.

వ్యక్తిగత దాడి...

అది జరిగిన కొద్ది రోజులకు మరో వివాదానికి తెరలేపారు కమల్​. 'కరుణానిధిని నేను అవమానించాను అని కొందరు అంటున్నారు. కానీ నిజంగానే నేను ఆయన్ను అవమానించాలనుకుంటే.. స్టాలిన్​ పేరు తీస్తే సరిపోతుంది' అని అన్నారు. తద్వారా... కరుణానిధి కుమారుడు స్టాలిన్​పై వ్యక్తిగత దాడికి దిగినట్టు అయ్యింది.

అయితే రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సహజమేనని, అందుకు తానేమీ చింతించనని స్పష్టం చేశారు మక్కల్​ నీది మయ్యం అధినేత.

ప్రచార కార్యక్రమాల్లో మక్కల్​ నీది మయ్యం అధినేత

ఇదీ చూడండి:-'పక్కా లోకల్' స్కెచ్​తో కమల్​ ప్రచారం

అదే సమయంలో వన్నియార్ల రిజర్వేషన్​ అంశాన్ని లేవనెత్తారు కమల్​. కులానికి సంబంధించిన జనాభా లెక్కలు చేయకుండానే.. రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని మండిపడ్డారు. వన్నియార్ల ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అలా చేయడం సరైన విషయమేనా? అని ప్రశ్నించారు.

పార్టీ గుర్తు టార్చ్​లైట్​తో కమల్​

రాజకీయ నిపుణుల మాట...

విమర్శలు, ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులకు కమల్​ చెబుతున్న కారణాల్లో అర్థం లేదని అంటున్నారు రాజకీయ నిపుణులు.

"వ్యక్తిగతంగా దాడి చేయకపోతే రాజకీయాల్లో ఉండలేమన్న మాటల్లో నిజం లేదు. వాటిని రాజకీయ నేతలు తగ్గించాలి. కాంగ్రెస్​ నేత కామరాజ్​ నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వరకు వీటిని మనం చూశాం. 'నాటి రాజకీయ నేతలు చేశారు.. మేమూ చేస్తాము' అని అనకూడదు. భిన్నమైన, ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రోత్సహిస్తానని ప్రజలకు చెప్పిన కమల్​.. ఇలాంటివి చేయకూడదు."

--- శ్రీనివాసన్​, రాజకీయ పరిశీలకుడు.

"కమల్​కు స్పష్టత లేదు. మార్పు తెస్తానని ఆయన అంటున్నారు. కానీ ఏ విధంగా మార్పు తెస్తారో చెప్పనే లేదు. రాజకీయ పార్టీ స్పష్టంగా ఉండాలి. పార్టీ కార్యక్రమాల గురించి అడిగితే ఆయన ఏమీ చెప్పరు. ప్రత్యర్థులు తనను కాపీ కొడతారని.. అందుకే చెప్పనని అంటారు. అంటే ఆయన వైఖరిపై ఆయనకే స్పష్టత లేదు. ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల సమస్యల్లో చాలా విషయాలు అసలు కమల్​కు తెలియవు. ఖాళీ సమయాన్ని గడిపేందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేట్​ యాడ్​లలో నటించడమే ఆయనకు తెలిసిన రాజకీయాలు. ఆయన ఒక పార్ట్​టైమ్​ పొలిటీషియన్​."

--- కె. ఇళంగోవన్​, రాజకీయ నిపుణుడు.

ప్రజలపై కమల్​ మాటలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో మే 2న తేలనుంది.

కమల్​ సభకు తరలివెళ్లిన ప్రజలు

ఇదీ చూడండి:-'ఆమె'కు వేతనమిస్తే తప్పేంటి?

ABOUT THE AUTHOR

...view details