దేశ రాజకీయాల్లో కల్యాణ్ సింగ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు కల్యాణ్ సింగ్. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ను భాజపా వశం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించి గౌరవించింది కమలదళం. ఇంతటి కీర్తి పొందిన ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి మరణించారు. అయితే కల్యాణ్ సింగ్ అనగానే అందరికి గుర్తొచ్చే విషయం.. 'బాబ్రీ మసీదు' ఘటన!
సీఎంగా ఉన్న సమయంలో..
ఎందరో నేతల వ్యూహాల కారణంగా 1992లో అయోధ్య రామ మందిర ఉద్యమం ఊపందుకుంది. వీరిలో కల్యాణ్ సింగ్ ఒకరు! 1992, డిసెంబర్ 6న.. వేల మంది కర సేవకులు అయోధ్యలో సమావేశమైన సమయంలో.. కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మసీదు ఘటన యావత్ దేశంలో సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు కల్యాణ్ సింగ్. అయితే సీఎం పదవి కోల్పోయినప్పటికీ, నాడు జరిగిన ఘటనపై తాను గర్వపడుతున్నానని అనేకమార్లు పేర్కొన్నారు కల్యాణ్‌సింగ్. ఈ ధైర్యమే.. ఆయన్ని రాముడికి 'అపర భక్తుడి'గా, రామ మందిర నిర్మాణం ఉద్యమంలో 'హీరో'గా మార్చింది.
ఆ ఘటన భాజపాకు అనేక విధాలుగా ఉపయోగపడింది. జాతీయ స్థాయిలో రాజకీయంగా లబ్ధిపొందింది. ఈ సెంటిమెంట్‌తోనే హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పట్టుసాధించి కేంద్రంలో అధికారం సొంతం చేసుకుంది. అటు ఉద్యమంలో వ్యవహరించిన నేతలు కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదీ చదవండి:'అయోధ్యలో రామ మందిరం చూడటం నా కల'
ఆ రోజు...
డిసెంబర్ 6న.. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంగణంలో వేల మంది కరసేవకులు గుమిగూడిన తరుణంలో ఫరీదాబాద్ జిల్లా కలెక్టర్(నేటి అయోధ్య) ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాల్పులు జరిపైనా కరసేవకులను అదుపు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ కాల్పుల నేపథ్యంలో అయోధ్య ప్రాంతం రక్తసిక్తమవుతుందని కూడా లేఖలో పేర్కొన్నారు. దాదాపు 4 లక్షల మంది కర సేవకులు సాకేత్ మహావిద్యాలయ ప్రాంతంలో సమావేశమైనట్లు స్పష్టం చేసి.. కాల్పులు జరపాలా? వద్దా? అనే దానిపై ఆదేశాలివ్వమన్నారు.
ఈ లేఖను నాటి ప్రధాన కార్యదర్శి.. ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు అందజేసినట్లు సీనియర్ పాత్రికేయులు పీఎన్ ద్వివేది తెలిపారు. అయితే.. కరసేవకులను నియంత్రించడానికి కాల్పులు జరపకాకుండా ఇతర మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు సింగ్.
సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఎలాంటి కాల్పులు జరపలేదు. కరసేవకులను శాంతియుతంగా అదుపు చేయాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ అధికారుల ప్రయత్నం విఫలమైంది. అనంతరం జరిగిన పరిణామాలతో రాజీనామా చేశారు కల్యాణ్ సింగ్.