Bihar Family News: ఈరోజుల్లో ఒక ఇంట్లో ఐదారుగురు సభ్యులు ఉంటేనే ఎన్నో సమస్యలు, మనస్పర్థలు వస్తుంటాయి. కుటుంబ నిర్వహణ కూడా భారంగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బిహార్లో మాత్రం ఓ ఉమ్మడి కుటుంబం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒకే ఇంట్లో ఏకంగా 62 మంది కలసిమెలసి అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఎలాంటి గొడవలు, సమస్యలు లేకాండా హాయిగా ఉంటున్నారు.
Biggest family in india: బిహార్ బోధ్గయాకు చెందిన ఈ ఫ్యామీలిని కల్యాణ్ కుటుంబం అని పిలుస్తారు. కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి ఈ ఇంటికి పెద్దలు. ఈ కుటుంబం విడిపోకుండా వీరే చూసుకుంటున్నారు. మొత్తం 62 మంది ఉండే ఈ ఇంట్లో 57 గదులుంటాయి. దాదాపు అందరికీ ప్రత్యేక రూమ్లు ఉన్నాయి. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కల్యాణ్ పరివార్ కాంప్లెక్స్ అంటారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంత మందికి కలిపి ఒకే కిచెన్ ఉంటుంది. అందరూ ఒకేసారి భోజనం చేస్తారు.
Gaya Kalyan Family: ఈ ఫ్యామిలీలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. వారిలో అజయ్ సింగ్ కల్యాణ్ పెద్ద. ఈ కుటుంబం కలసి ఉండటానికి తమ దివంగత.. అంకుల్, ఆంటీలు రామ్లఖాన్ సింగ్, గంగాదేవీనే కారణమని అజయ్ చెప్పారు. వారి మరణం తర్వాత తమ తల్లిదండ్రులు కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి కుటుంబాన్ని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ అంకుల్ లాగే తండ్రికి కూడా ఉమ్మడి కుటుంబమంటేనే ఇష్టమని, అందుకే ఇప్పటివరకు కుటుంబం నుంచి ఎవరూ విడిపోలేదని వివరించారు.