Kailash vijayvargiya agneepath: అగ్నివీర్లపై భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. భాజపా పార్టీ కార్యాలయాల్లో భద్రతా సిబ్బందిగా అగ్నివీర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని విజయవర్గీయ ఆదివారం వ్యాఖ్యానించారు. యువత సైన్యంలో భాగమవ్వడం వల్ల క్రమశిక్షణ, విధేయత వంటి లక్షణాలను పెంపొందించుకుంటారని అన్నారు. ఉద్యోగ విరమణ నాటికి అగ్నివీర్ల చేతిలో రూ.11 లక్షలు ఉంటాయని తెలిపారు. ఆదివారం అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తూ భోపాల్ భాజపా కార్యాలయంలో విజయవర్గీయ ఈ వ్యాఖ్యలు చేయగా.. విపక్షంతో పాటు సొంత పార్టీ ఎంపీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యాఖ్యలను భాజపా ఎంపీ వరుణ్ గాంధీ ఖండించారు.
భాజపా నాయకుడు కైలాశ్ విజయవర్గీయ.. సైనికులను అవమానించారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తక్షణమే సైన్యానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అలాగే సోషల్ మీడియాలోనూ విజయవర్గీయ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'సైనికులను భాజపా ప్రధాన కార్యదర్శి అవమానించారు. అగ్నివీర్ సైనికులు భాజపా కార్యాలయం వెలుపల భద్రతా సిబ్బంది అవుతారని అంటున్నారు. ఇది సిగ్గులేని ప్రభుత్వం. అందుకే అగ్నిపథ్ పథకాన్ని వద్దని అంటున్నాం మోదీజీ' అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.