2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడానికి చైనా కుట్ర పన్నుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ ఆరోపించారు. దేశంలో రెండో దశ కరోనా సైతం చైనా సృష్టించిన పన్నాగమేనని చెప్పారు. చైనా మ్యాన్ మేడ్ వైరస్ వల్లే దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. అందువల్లే ఆసియాలోని దేశాలన్నింటిలో భారత్ మాత్రమే ఇబ్బంది పడుతోందని, మరెక్కడా ఇంత తీవ్రత లేదని చెప్పుకొచ్చారు.
అందుకే మోదీపై కుట్ర..
మోదీ దౌత్య నీతి వల్ల చైనా నిస్సహాయంగా మారిపోయిందని విజయవర్గీయ అన్నారు. అనేక ఇస్లామిక్ దేశాలు మోదీ వెంట ఉండడం వల్ల చైనా కోపం పెంచుకుందని చెప్పారు. గతంలో జరిగిన అమెరికా ఎన్నికల్లోనూ ట్రంప్‌నకు చైనా సహకరించిందనే వార్తా కథనాలను గుర్తు చేశారు.