తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Avinash Video: వివేకా హత్య రోజు అసలు ఏం జరిగింది..? వీడియో రిలీజ్​ చేసిన అవినాష్​ రెడ్డి

MP Avinash Video: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్​ రెడ్డి మీడియాకు ఓ వీడియో రిలీజ్​ చేశారు. ఆ వీడియోలో వివేకా హత్య గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారంటే..?

MP Avinash Video
MP Avinash Video

By

Published : Apr 27, 2023, 3:58 PM IST

MP Avinash Video: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డి మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో వివేకా హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించిన అవినాష్.. కేంద్ర దర్యాప్తు సంస్థపై మరోసారి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇకపోతే అవినాష్​​ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనున్న నేపథ్యంలో అవినాష్​ రిలీజ్​ చేసిన వీడియో రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఆ వీడియోలో పలు సంచలన ఆరోపణలు చేశారు. అలాగే సీబీఐ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టాలని పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సూచించారని ఎంపీ అవినాష్‌రెడ్డి మరోమారు ఆరోపించారు. వివేకానందరెడ్డిది హత్య అని నిర్ధారించే ఈ లేఖను సీబీఐ అధికారులు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. వివేకా కూతురు సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డిని కాపాడేందుకే సీబీఐ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని అవినాష్‌ రెడ్డి ప్రశ్నించారు.

అలాగే వివేకా హత్య రోజు శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేశారని అవినాష్‌ రెడ్డి వీడియోలో తెలిపారు. ఉదయం 6.26 గంటలకు ఫోన్ చేస్తే తాను వివేకా ఇంటికెళ్లానని.. ఆలోపే కృష్ణారెడ్డి ద్వారా హత్య విషయం వారి కుటుంబానికి తెలుసన్నారు. వివేకా ఇంట్లో లేఖ విషయం కూడా సునీత, రాజశేఖర్, శివప్రకాశ్‌రెడ్డికి తెలుసని ఆరోపించారు. వాళ్లు ఎందుకు ముందుగా పోలీసులకు ఫోన్ చేయలేదని ప్రశ్నించారు. లేఖ విషయం కూడా ఎందుకు దాచిపెట్టారని నిలదీశారు. తాను 6.30 గం.కు వివేకా ఇంట్లోకి వెళ్లాక పోలీసులకు ఫోన్ చేసినట్లు వివరించారు.

వివేకా కుటుంబానికి హత్య విషయం తెలిసినా మౌనంగా ఉన్నారన్నారు. హత్య విషయం తెలిసినా ఎందుకు పోలీసులకు చెప్పలేదని.. హత్య గురించి మౌనంగా ఉండడం.. పోలీసులకు చెప్పకపోవడం వెనక అనుమానాలున్నాయన్నారు. ఆ కోణంలో సీబీఐ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు. సీబీఐ అధికారి రామ్‌ సింగ్ తనని ఇరికించేందుకే కుట్ర పన్నినట్లు తెలుస్తోందని అవినాష్‌ అన్నారు. ఈ కేసులో అన్ని విషయాలు నిజాయతీగా నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అవినాష్‌ అభిప్రాయపడ్డారు.

వీడియో రిలీజ్​ చేసిన అవినాష్​ రెడ్డి

"పులివెందుల రింగు రోడ్డులో ఉన్నప్పుడు శివప్రకాశ్​ రెడ్డి నాకు ఫోన్​ చేశాడు. అర్జెంటుగా వివేకా ఇంటికి వెళ్లమన్నాడు. ఎందుకు అని అడిగితే.. చనిపోయాడని చెప్పాడు. వెంటనే నేను అక్కడి నుంచి వివేకా వాళ్ల ఇంటికి వెళ్లినా... నేను ఇంటికి వెళ్లిన వెంటనే పీఏ కృష్ణా రెడ్డి నాకు వివేకా చనిపోయాడని.. బాత్​రూంలో ఉన్నాడని చెప్పాడు. వివేకా రాసిన లేఖ, ఫోన్​ను రాజశేఖర్​ రెడ్డి దాయమని చెప్పారు. ఆ లేఖ గురించి ఎందుకు సీబీఐ వాళ్లకి చెప్పలేదు. సునీత, రాజశేఖర్​ రెడ్డి, శివప్రకాశ్​ రెడ్డిని కాపాడటానికే సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.."- అవినాష్‌ రెడ్డి, కడప ఎంపీ

వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: మరో వైపు వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ హత్య కేసులో కీలక అనుమానితుడుగా ఉన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ బృందం నేరుగా కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లింది. కృష్ణారెడ్డి కోసం ఆరా తీస్తే ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వివేక భార్య సుజాత, కుమారుడు రాజేష్​ను దాదాపు రెండు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలోనే కృష్ణారెడ్డి కోసం మరికొంతమంది సీబీఐ అధికారులు పులివెందులలోని లయోలా కళాశాలకు కూడా వెళ్లారు. అక్కడ కూడా కృష్ణారెడ్డి లేకపోవడంతో మళ్లీ తిరిగి వచ్చారు. కృష్ణారెడ్డి ఎక్కడికెళ్లారని కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఉదయమే ఇంటి నుంచి వెళ్లాడని కుటుంబ సభ్యులు సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడని దానిపై సీబీఐ అధికారుల బృందం ఆరా తీస్తోంది. అయితే సీబీఐ అధికారులు విచారణకు వస్తారన్న విషయం తెలుసుకుని కృష్ణారెడ్డి అజ్ఞానతంలోకి వెళ్లినట్లు సమాచారం. కృష్ణారెడ్డిని విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలుస్తాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details