MP Aviansh Reddy Attended to CBI Inquiry: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముందు హాజరయ్యారు. ఐదోసారి ఆయన సీబీఐ విచారణకు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు అవినాష్ వెళ్లారు. ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదితో కలిసి సీబీఐ విచారణకు అవినాష్ హాజరయ్యారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారించనుంది.
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు: మరోవైపు వివేకా హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరిని ప్రశ్నించనున్నారు. ఈనెల 14న ఏ6 ఉదయ్‌కుమార్‌రెడ్డిని, ఈనెల 16న ఏ7 వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆరు రోజులపాటు సీబీఐ అధికారులు ఇద్దరినీ ప్రశ్నించనున్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను కలిపి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ గుర్తించిన అంశాలతో పాటు హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే విషయాలపై వివరాలు సేకరించనుంది.