AVINASH REDDY WRIT PETITION: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మూడోసారి సీబీఐ విచారణకు హాజరు కాకముందే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మార్చి 10న మరోసారి విచారణకు రావాలని ఈ నెల 5న సీఆర్పీసీ 160 కింద సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు. ఇంతలోనే గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆడియో, వీడియో రికార్డు చేయాలి:అందులో సీబీఐ దర్యాప్తు అధికారి విచారణ తీరును అవినాష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదన్నారు. న్యాయవాదిని అనుమతించాలని, ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసినా స్పందించలేదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆడియో, వీడియా రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని కోరారు. న్యాయవాదిని అనుమతించాలని కోరారు.
సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి:తన వాంగ్మూలానికి సంబంధించిన ప్రతులను అందజేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలన్నారు. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అవినాష్ కోరారు. ఇప్పటివరకూ రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందన్న అవినాశ్ రెడ్డి.. వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాశ్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
వాంగ్మూలంలో సవరణలు: తన వాంగ్మూలం నమోదు సందర్భంగా కంప్యూటర్ మానిటర్ కేవలం దర్యాప్తు అధికారికి, టైపిస్టుకు మాత్రమే కనిపిస్తోందని, తనకు కనిపించలేదని అవినాష్‌రెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు. విచారణ సమయంలో 30 , 40 సార్లు దర్యాప్తు అధికారి మౌస్ తీసుకుని సవరించారని, కొన్నింటిని తొలగించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఏవి తొలగించారో తనకు తెలియడం లేదన్నారు. వాంగ్మూలం ప్రతిని అడిగితే నిబంధనలు ఒప్పుకోవని నిరాకరించారన్నారు.