YS Viveka murder case : వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ఎవరికీ అంతుచిక్కడంలేదు. విచారణకు రాలేనంటూ అవినాష్‌రెడ్డి పదేపదే సాకులు చెప్పడం.. సీబీఐ మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈరోజు కూడా విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి స్పష్టం చేయగా సీబీఐ ఇప్పుడు ఏం చేయబోతోందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు అవినాష్ అనుచరులు రెచ్చిపోతున్నారు. మొన్న హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులపై దాడి చేయడంపై దుమారం చల్లారకముందే.. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద రాత్రి దౌర్జన్యానికి దిగారు.
డిశ్ఛార్జి అయ్యే వరకు విచారణకు రాలేను: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు రాలేనంటూ సీబీఐకీ లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా సీబీఐ విధించిన గడువులోపు విచారణకు హాజరు కాలేనని.. విచారణకు హాజరు కావటానికి మరింత సమయం కావాలని లేఖలో సీబీఐని కోరారు. ప్రస్తుతం తన తల్లి ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. కోలుకుని డిశ్ఛార్జి అయ్యే వరకు విచారణకు రాలేనని లేఖలో వివరించారు. తల్లితో పాటు హస్పిటల్లో ఉన్నానని.. ఇలాంటి పరిస్థితిలో ఆమెను వదిలి రాలేనని అన్నారు. ఆమె కోలుకుని సాధారణ స్థితికి చేరుకునే సరికి దాదాపు పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని లేఖలో వివరించారు.
ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఐ అవినాష్‌రెడ్డికి విచారణకు మళ్లీ గడువు ఇస్తుందా.. ఇంకేదైనా నిర్ణయానికి వస్తుందా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సి ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపినప్పటి నుంచీ అవినాష్‌రెడ్డి.. విచారణను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వరుసగా మూడోసారి గడువు వరకు హాజరు కాలేను అంటూ సీబీఐని మినహాయింపు కోరారు. అభియోగాలు మోపిన తర్వాత మినహాయింపులు ఇవ్వడంపై సీబీఐ విమర్శలపాలవుతోంది.
మరోవైపు అవినాష్‌రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అవినాష్‌రెడ్డి ఆసుపత్రి ప్రాంగణం దాటి బయటకు రాలేదు. నాలుగో అంతస్తులో తన తల్లి ఉండగా.. అతని కోసం వచ్చిన వారితో మాట్లాడేందుకు మాత్రమే ఐదు అంతస్తులోకి రాకపోకలు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో తన కోసం కొన్ని గదులు తీసుకున్నప్పటికీ ఆయన అక్కడికి వెళ్లిన దాఖలాలు లేవు. అవినాష్‌రెడ్డి కర్నూలు వచ్చాక.. కొందరు సీబీఐ అధికారులు కర్నూలు వచ్చి ఇక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అవినాష్ రెడ్డి అనుచరుల వీరంగం : ఇదే సమయంలో విశ్వభారతి ఆస్పత్రి వద్ద అవినాష్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేశారు. ఇక్కడుంటె ఊరుకునేదే లేదంటూ మీడియా ప్రతినిధులను నానా దుర్భాషలాడారు. రాత్రి సమయంలో మీకు ఇక్కడ ఏం పని అంటూ మొదట ఆర్‌టీవీ ప్రతినిధులపై, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెంకటేశ్వర్లుపై దాడికి దిగారు. దీంతో మిగిలిన మీడియా ప్రతినిధులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మీడియా ప్రతినిధుల దగ్గర నుంచి కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. అసలు ఆ వీధిలోకే ఇతరులెవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు. ఈటీవీ కెమెరామెన్ రామకృష్ణారెడ్డినీ కొంత దూరం వరకు వెంటపడి తరిమారు. ఆ వీధిలో ఉన్న పలువురితో మాట్లాడి వారు మీడియా ప్రతినిధుల కాదా అని ప్రశ్నించారు. వారిని నిశితంగా పరిశీలించిన తర్వాత మీడియా ప్రతినిధులు కాదని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి పంపించారు. అవినాష్ రెడ్డి అనుచరులు మద్యం మత్తులో ఉండటంతో పోలీసులూ వారిని నిలువరించే సాహసం.. చేయలేకపోయారు. దాదాపు 60 నుంచి 70 మంది అవినాష్‌రెడ్డి అనుచరులు ఆస్పత్రి సమీపంలోని లాడ్జిల్లో.. మకాం వేసినట్లు తెలుస్తోంది. వారందరికీ నగరంలో నివసిస్తున్న ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యే భోజనాలు సమకూరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది
ఇవీ చదవండి :