'కచ్చా బాదమ్' పాట వినని వాళ్లు ఉండరేమో. మరి ఈ పాటను అంతగా ప్రపంచానికి పరిచయం చేసిన భుబన్ బద్యాకర్ పేరు కుడా దాదాపు అందరికి సుపరిచితమే. అయితే ప్రస్తుతం ఆయన కష్టాల్లో కూరుకుపోయారు. ఆఖరికి ఇంటి అద్దె కట్టలేని స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగిందంటే..
'కచ్చా బాదం' పాటతో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా ఎదిగారు బంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్. అయితే ప్రస్తుతం ఉండటానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను సెలబ్రిటీగా మారిన తర్వాత వచ్చిన డబ్బును గ్రామస్థులు పలు దఫాలుగా తన నుంచి కాజేశారని వాపోయారు భుబన్. ఇప్పుడు తన దగ్గరున్న మొత్తం సొమ్ము అయిపోవడం వల్ల గ్రామంలోని కొందరు యువకుల వేధింపులు భరించలేక స్వగ్రామాన్ని ఖాళీ చేసి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ స్థితికి చేరుకోవడానికి స్థానికులే కారణమని చెబుతున్నారు భుబన్.
కాగా.. తాను పాడిన కచ్చా బాదమ్ పాటకు కాపీరైట్ రావటం వల్ల ఇప్పుడు తాను పాటను పాడలేనని చెబుతున్నారు భుబన్. ప్రస్తుతం నేను ఏమి పని చేయట్లేదని.. ఆదాయమూ రావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతడు పాకుర్తలాలోని ఓ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంటి అద్దె నెలకు రూ.2700.
అయితే తాను హమ్ చేసిన లిరిక్స్‌తో తక్కువ వ్యవధిలోనే సెలబ్రిటీగా మారడం వల్ల ఇండస్ట్రీ నుంచి కొన్ని అవకాశాలూ వచ్చాయి భువన్కు. ఆ సమయంలో సంపాదించిన డబ్బును ఇప్పటి వరకు ఖర్చు చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ డబ్బును గ్రామంలోని కొందరు యువకులు జల్సాల కోసం భుబన్ దగ్గర డిమాండ్ చేసి మరీ తీసుకెళ్లేవారట. దీంతో ఆయన దగ్గరున్న డబ్బంతా అయిపోవడం వల్ల గ్రామస్థుల వేధింపులు తట్టుకోలేక మరో ఊరికి మకాం మార్చారు భుబన్. అయితే తన సొంత ఊర్లో కూడా భువన్ అద్దె ఇంట్లోనే ఉండేవారట.
"నేను పాడిన పాట పాపులర్ అవ్వడం వల్ల నేను కొద్ది రోజుల్లోనే సెలబ్రిటీ అయ్యాను. దీంతో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. వాటితో నేను కొంత డబ్బు సంపాదించాను. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నా ఎదుగుదలను చూసి గ్రామంలోని కొందరు ఓర్వలేదు. నా దగ్గరున్న సొమ్మును కొందరు యువకులు పిక్నిక్, జల్సాల పేరుతో డిమాండ్ చేసి తీసుకెళ్లేవారు. గొడవెందుకని నేను వారికి ఇచ్చేసేవాడిని. దీంతో నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. ప్రస్తుతం నా పెద్ద కుమారుడు ప్రభుత్వ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి సంపాదనతోనే మేము బతుకుతున్నాము."-