తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించి... కేంద్రంలోకి... - జ్యోతిరాదిత్య సింధియా

మధ్యప్రదేశ్, బిహార్​ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్​కు ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్​లో చోటు దక్కింది. కేంద్రమంత్రులుగా అవకాశం దక్కడానికి ముందు ఈ ఇద్దరు నేతలు తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సింధియా కారణంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్​లో అధికారం కోల్పోగా.. ఎల్​జేపీ అధ్యక్షుడిని తానే అని ప్రకటించి ఆ పార్టీలో సంక్షోభానికి తెరలేపారు పరాస్​.

jyotiraditya scindia, Pashupati Kumar Paras
సింధియా, పశుపతి కుమార్​ పారస్​

By

Published : Jul 7, 2021, 6:39 PM IST

కొత్తగా కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్​లో చోటు దక్కిన వారిలో మధ్యప్రదేశ్​కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా, బిహార్​కు చెందిన ఎల్​జేపీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్​ ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి రాకముందు వీరు తమ రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. వీరు తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

సింధియా తిరుగుబావుటా..

మధ్యప్రదేశ్​లో భాజపా అధికారం చేజి​క్కించుకుందంటే అది జ్యోతిరాదిత్య సింధియా వల్లే సాధ్యమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు గాను 114 స్థానాలు గెలిచి ఇతరుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​పై తిరుగుబావుటా ఎగురవేసి సంచలనం సృష్టించారు సింధియా. గ్వాలియర్ రాజవంశస్థుడైన ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. హస్తం పార్టీపై అసంతృప్తితో తన అనుచరణ గణం 25 మంది ఎమ్మెల్యేలతో కలిసి మార్చి 2020లో భాజపాలో చేరారు. ఫలితంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసిన తన అనుచరుల్లో చాలా మందిని సింధియా గెలిపించుకున్నారు. దీంతో అప్పటి వరకు ఉన్న భాజపా బలం 107 నుంచి 126కి పెరిగింది. ఫలితంగా మధ్యప్రదేశ్​లో తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకుంది.

అయితే గుణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన సింధియా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తన చిరకాల ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కృష్ణపాల్‌ సింగ్‌ యాదవ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 2020లో కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరిన తర్వాత సింధియాకు రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కింది. ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో చోటు లభించింది. సింధియాకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

బిహార్​లో సంచలనం..

బిహార్‌ ఎన్నికలకు ముందు ఎల్​జేపీ అధినేత రామ్‌విలాస్‌ పాసవాన్‌ చనిపోగానే.. ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే ఇటీవల ఎల్​జేపీ నూతన అధ్యక్షుడిని తానే అని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు పశుపతి కుమార్ పరాస్​. పార్టీ పీఠం నుంచి చిరాగ్​ను తొలగించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. చిరాగ్​ మినహా పార్టీలో ఉన్న మిగతా ఐదుగురు ఎంపీలు పశుపతి పరాస్​కు మద్దుతుగా నిలిచారు. లోక్‌సభలో పశుపతి వర్గాన్ని గుర్తిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం కూడా అధికారికంగా ప్రకటించింది. దీంతో చిరాగ్ ఏకాకి అయ్యారు.

ఇదీ చూడండి: ఎల్​జేపీపై పట్టుకు నేతల ఎత్తులు

అయితే భాజపా అధిష్ఠానంతో ముందుగానే చర్చించి కేంద్రమంత్రి వర్గంలో బెర్తు ఖరారు చేసుకున్నాకే పశుపతి పరాస్ ఎల్​జేపీలో తిరుగుబావుటా ఎగురవేశారని ప్రచారం జరిగింది. జేడీయూ అధినేత, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్ పాత్ర కూడా ఉందని జోరుగా వార్తలొచ్చాయి.

ఇప్పుడు ఆ ఊహాగానాలే నిజమయ్యాయి. మోదీ నూతన కేబినెట్​లో పశుపతి పరాస్​కు చోటు దక్కింది. 71 సంవత్సరాల పశుపతి ఆరుసార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు.

భాజపా, దాని మిత్రపక్షాల నుంచి మొత్తం 43 మందికి కేంద్రమంత్రులుగా అవకాశం దక్కింది. వచ్చే ఏడాది ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​​, గోవా, పంజాబ్​, గుజరాత్​ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ కేబినెట్​లో ఆయా రాష్ట్రాల నేతలకు సముచిత స్థానం కల్పించారు.

మంత్రి వర్గ విస్తరణలో జోతిరాదిత్య సింధియా, పశుపతి పరాస్​తో పాటు భూపేందర్​ యాదవ్​, అనుప్రియ పటేల్​, మీనాక్షీ లేఖీ, అజయ్​ భట్​, అనురాగ్​ ఠాకూర్ వంటి నేతలకు అవకాశం దక్కింది.

ABOUT THE AUTHOR

...view details