Justice UU Lalit: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ 74 రోజులపాటు పనిచేయనున్నారు.
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ముమ్మారు తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యుయు లలిత్ భాగస్వామి. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా ఘనత సాధించారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
1957, నవంబరు 9న జన్మించిన జస్టిస్ లలిత్.. 1983 జూన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986జనవరి నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.