భారత సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి జస్టిస్ రమణను ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేస్తారు. 24న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. లాంఛనం ప్రకారం నియామక ఉత్తర్వులను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, న్యాయశాఖ కార్యదర్శి బరున్ మిత్రలు జస్టిస్ రమణకు అందజేశారు. ప్రధాన న్యాయమూర్తిగా 2022 ఆగస్టు 26 వరకు ఆయన కొనసాగుతారు.
సాధారణ కుటుంబం నుంచి...
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న సాధారణ వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి గణపతిరావు, సరోజినిదేవీ దంపతులకు జన్మించిన జస్టిస్ రమణ స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. 1966లో జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగా.. ఆ తరువాత ఇన్నేళ్లకు జస్టిస్ రమణ మళ్లీ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపడుతున్న తెలుగు వ్యక్తిగా ఖ్యాతి గడించారు. జస్టిస్ కోకా సుబ్బారావు న్యాయవాద కుటుంబంలో పుట్టి పెరిగి ఆ రంగంలో అత్యున్నత స్థానానికి చేరితే, జస్టిస్ రమణ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి సర్వోన్నత పీఠాన్ని అధిరోహించబోతున్నారు. పొన్నవరంలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. తర్వాత కంచికచర్లలో విద్యాభ్యాసం సాగించారు. అమరావతి ఆర్‌వీవీఎస్ కాలేజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పురోగమించారు.
అడ్డంకుల్ని పటాపంచలు చేస్తూ ముందడుగు
పట్టుదలతో దేన్నయినా సాధించే సంకల్పబలం ఉన్న జస్టిస్ రమణ తాను నమ్ముకున్న రంగంలో అంచెలంచెలుగా ఎదిగి తెలుగువారి కీర్తి పతాకాన్ని దిల్లీలో ఎగరేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందే సమయంతో పాటు, ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత పీఠాన్ని అధిరోహించడానికి సమాయత్తమయ్యే సమయంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆయన వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ముందడుగు వేశారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. తర్వాత అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, అనంతరం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఏడేళ్లుగా సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన తీర్పులు వెలువరించారు.
విస్పష్ట తీర్పులకు పెట్టింది పేరు
జస్టిస్ రమణకు ముందుకానీ, తర్వాత కానీ వారి కుటుంబంలో న్యాయరంగ నేపథ్యం ఉన్నవారెవ్వరూ లేరు. సరళంగా, సౌమ్యంగా కనిపించే ఆయన విస్పష్టమైన తీర్పులకు పెట్టింది పేరు. సుప్రీంకోర్టులో గత ఏడేళ్లలో ఏటా 2వేల వరకు కేసులను విచారించారు. వేల సంఖ్యలో ఉత్తర్వులు జారీచేశారు. 156 కీలకమైన తీర్పులు ఇచ్చారు. మాతృభాష, సాహిత్యం అంటే ఎనలేని మమకారం. అందుకే దిల్లీలోని తన అధికార నివాసం ముందున్న నామఫలకంలో ఇంగ్లిష్‌తోపాటు, తెలుగులోనూ పేరు రాయించుకొని దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న భావనను చాటుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను గుర్తుంచుకోవాలన్నది ఆయన సిద్ధాంతం.
సామాజిక అభ్యుదయంపై తపన
జస్టిస్ రమణ న్యాయవాద వృత్తిని యాదృచ్ఛికంగా, చివరి అవకాశంగా ఎంచుకున్నారు. చురుకైన విద్యార్థి జీవిత నేపథ్యం ఉన్న ఆయన ఎప్పుడూ సామాజిక అభ్యుదయం కోసం తపిస్తారు. రైతులు, కార్మికులు, ఇతర సామాజిక అంశాలపై విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొనడానికి వెళ్తూ పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకున్నదీ ఇటీవల ఓ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. న్యాయవాద వృత్తి చేపట్టకముందు కొన్నాళ్లపాటు ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు పాత్రికేయుడిగా సేవలందించారు. బాల్యం నుంచే సామాజిక చైతన్య స్ఫూర్తిగల ఆయన న్యాయవాద వృత్తి చేపట్టిన తర్వాతా న్యాయవాదుల సంక్షేమం, ఇతరత్రా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించే సమయంలో ఎన్నో వినూత్నమైన, పురోగమన నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగ విలువలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విస్తృతమైన తీర్పులిచ్చారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
దేశ న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలన్నదే నూతన సీజేఐ ప్రధాన లక్ష్యం. ఇటీవల గోవాలో జరిగిన బాంబే హైకోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ- 'జాతీయ న్యాయ మౌలిక వసతుల వ్యవస్థ' ఏర్పాటును ఆయన ప్రతిపాదించారు. న్యాయవ్యవస్థకు అవసరమైన భవనాలు, గృహ సముదాయాల నిర్మాణం, ఇతర ఆధునిక పరికరాలను సమకూర్చే ప్రధాన బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించాలన్నది ఆయన ఉద్దేశం. న్యాయవిద్యను సంస్కరించి మరింత నాణ్యంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. లోతుగా, విమర్శనాత్మకంగా ఆలోచించేలా విద్యార్థులను తయారు చేయడమే చదువు ముఖ్య ఉద్దేశం కావాలని ఇటీవల విశాఖలో జరిగిన దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని నిర్మించి, వారిలో సామాజిక స్పృహ, బాధ్యతలను పెంపొందించే స్థాయిలో ప్రస్తుత విద్యా వ్యవస్థ లేదని, అందువల్ల దీని ప్రక్షాళనకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలని కూడా పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందని ఆయన తొలినుంచీ వాదిస్తూ వస్తున్నారు. మౌలిక వసతులంటే కేవలం భవనాలు, ఇతర సౌకర్యాలు మాత్రమే కాదని, న్యాయమూర్తుల నియామకం నుంచి కేసుల పరిష్కారం వరకూ ప్రతి అంచెనూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు తీర్చిదిద్దడమేనని ఆయన అభిప్రాయం.
సీఎంలు, కేంద్ర మంత్రుల అభినందనలు
సీజేఐగా నియమితులైన జస్టిస్ రమణకు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వివిధ పక్షాల నేతలు, ఎంపీలు అభినందనలు తెలిపారు. "48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం విజయవంతం, ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా" అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్విటర్లో పేర్కొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలుపుతూ ఆయన చేపట్టబోయే నూతన బాధ్యతలు పూర్తి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కూడా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.