ఏ కేసులోనైనా మూడేళ్లలోపు తీర్పు వెలువరించకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్లేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సాధారణంగా మూడేళ్ల తర్వాత ఎవరికైనా న్యాయం అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. "కొవిడ్-19లాంటి సంక్షోభ సమయంలోనూ ప్రజలకు న్యాయం అందిస్తూ ఎన్నో దేశాల న్యాయ వ్యవస్థలకు సుప్రీంకోర్టు మార్గదర్శిగా నిలిచింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటమే కాకుండా, దాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం బాసటగా నిలుస్తోంది. కిందిస్థాయి కోర్టుల్లో మౌలిక వసతులు పెంచడానికి నిర్ణయించాం.
పెండింగ్ కేసులు, ముఖ్యంగా కింది కోర్టుల్లో పేరుకుపోయిన కేసులు మనందరికీ సవాల్. సామాన్య ప్రజలు సత్వర న్యాయాన్ని కోరుకుంటారు. న్యాయం కోసం వారు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా సకాలంలో న్యాయం అందించాలి. నేను జస్టిస్ రమణ నుంచి అదే ఆకాంక్షిస్తున్నాను. మేం ఏది ఆశిస్తున్నామో ఆయన కచ్చితంగా అదే చేస్తున్నారు" అని మంత్రి పేర్కొన్నారు. 'జస్టిస్ రమణ వ్యక్తిత్వం, నేపథ్యం గురించి నాకు మొదట్లో పెద్దగా తెలియదు. నిబద్ధత, సంపూర్ణ విశ్వాసం గల ప్రధాన న్యాయమూర్తి భారతదేశానికి ఉన్నారని ఆయన్ని కలిసిన తొలి భేటీలోనే అనిపించింది. ఆయన హయాంలో భారత ప్రజలకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగింది' అని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి గురించి ఎవరేం అన్నారంటే..
మానవత్వం ఉన్న న్యాయమూర్తి..
గొప్ప న్యాయమూర్తిగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా జస్టిస్ రమణ నాకు తెలుసు. న్యాయ మేధోశక్తి, విజ్ఞానం, నిష్పక్షపాత వైఖరిలాంటివి ఎన్ని ఉన్నా మానవత్వం.. మనిషిని మిగతా వారికంటే గొప్ప స్థానంలో నిలుపుతుంది. ఆయన న్యాయవాదుల కుటుంబానికి కర్తలాంటివారు.
- తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
అసాధారణ పరిపాలన దక్షుడు..
ఉన్నత స్థాయికి వచ్చిన కొందరు వ్యక్తులు కోపం, అహం ప్రదర్శిస్తుంటారు. జస్టిస్ రమణను చూసిన తర్వాత ఆయన ఆ పదవికే గర్వకారణంగా మారారని చెప్పక తప్పదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఆయన్ని కలిసినప్పుడు జూనియర్ జడ్జిగా నన్ను చూడలేదు. ఆయన అసాధారణ పరిపాలన దక్షుడు. న్యాయవ్యవస్థపై ఆయన చెదరని ముద్రవేయడం ఖాయం.
- జస్టిస్ ఎంఎం సుందరేశ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సచిన్ తెందుల్కర్‌లా రికార్డులు..
జస్టిస్ రమణ మా బృంద నాయకుడిగా ఉండటం గర్వకారణం. ఆయన న్యాయ వ్యవస్థకు కర్తలాంటివారు. ఆయన నిజమైన నాయకుడు, కుటుంబ పెద్దలాంటివారు. సచిన్ తెందుల్కర్‌లా ఒకదానితర్వాత ఒకటిగా ఆయన రికార్డులు బద్దలు కొడుతున్నారు. తొమ్మిదిమంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడమే అందుకు ఉదాహరణ. మాకు ఆయన నిజమైన పెద్దన్నలాంటివారు. సహచరులందర్నీ కుటుంబ సభ్యులుగానే చూస్తారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు.
- జస్టిస్ బీవీ గవాయ్,సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సువర్ణ హృదయమున్న న్యాయమూర్తి..