Jupally Krishnarao Reacts on BRS Suspension: బీఆర్ఎస్ అధిష్ఠానం కొల్లాపూర్ మాజీ ఎమ్మెలే జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ వేటు అనంతరం మొదటిసారి స్పందించిన మాజీ మంత్రి జూపల్లి హైదరాబాద్‌లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై వ్యవహరించిన తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేయండి : తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషమేనని.. కానీ ఎందుకు అలా చేశారో స్పష్టంగా చెప్పాలని జూపల్లి కృష్ణారావు అన్నారు. తాను అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లుగా సభ్యత్వం పుస్తకాలు తనకు ఇవ్వలేదన్న జూపల్లి.. పార్టీ సభ్యుడిగా తాను ఉన్నట్లా.. లేనట్లా.. అని ప్రశ్నించారు. పారదర్శక పాలన అందించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. ఇష్టారీతిన పాలన చేస్తా.. అడిగేందుకు మీరెవరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్పై మండిపడ్డారు.
'తెలంగాణ సాధనలో యావత్తు తెలంగాణ సమాజం భాగస్వామ్యం ఉంది. 2011 మార్చిలో సకల జనుల సమ్మె రద్దు చేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. అదే రోజున నాటి సీఎం తెలంగాణ ఉద్యమం అణచివేసినట్లు చెప్పారు. తెలంగాణ నేతలు పదవులు వదిలి ఉండలేరని నాటి కేంద్ర మంత్రి కావూరి చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లా అంతా పాదయాత్ర చేశాను. పార్టీ నుంచి సస్పెండ్ చేసినపుడు సీఎం స్పందించలేదు. సస్పెన్షన్ విషయమై మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.'-జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి