Judges pension hike bill: న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికార పరిధుల్లోకి ఇతర వ్యవస్థలను చొరబడనివ్వదని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పరిమితుల్లో తాను ఉంటూనే ఇతర వ్యవస్థలూ వాటి హద్దుల్లో అవి ఉండేలా చూస్తుందని తెలిపారు. తాము నిర్ణయించిన వ్యక్తినే జడ్జిగా నియమించాలని ఎవరూ ప్రభుత్వాన్ని బలవంత పెట్టలేరనీ పేర్కొన్నారు. వివిధ వర్గాల ద్వారా అందిన, సేకరించిన సమాచారం ఆధారంగానే ఆయా వ్యక్తులకున్న సమర్థతలను, అర్హతలను పరిశీలిస్తామన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల జీతాలు, సర్వీసు నిబంధనల సవరణ బిల్లు-2021పై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఉన్నత న్యాయస్టానాల్లో జడ్జిల నియామకంలో నిబంధనలను పాటించాల్సి ఉంటుందని, వచ్చిన సిఫార్సులను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులా? అనర్హులా? అన్నది నిర్ణయించడం జరుగుతుంది. న్యాయవ్యవస్థకు ఉన్నట్లే శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకూ స్వతంత్రత ఉంటుంది. ఈ వ్యవస్థలన్నిటి మధ్య ఒక స్పష్టమైన రేఖను రాజ్యాంగం గీసేంది. ఆ గీతను అతిక్రమించి ఇతర వ్యవస్థల పరిధిలోకి ఎవరూ చొరబడరాదు. ఒక వ్యవస్థ హద్దులు నిర్ణయించారంటే మరో వ్యవస్థకు కూడా పరిమితులు ఉన్నట్లే కదా. మేం వాటిని అధిగమించాలని కోరుకోవడంలేదు"
-కిరెన్ రిజిజు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి.