హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఉమ్మడి పౌరస్మృతి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం కోటా కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. సంకల్ప్ పత్ర్ పేరుతో ఈమేరకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు - bjp sankalp patra hp
హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా ఓటర్లే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చింది.
తమకు మళ్లీ అధికారం అప్పగిస్తే.. 8 లక్షల ఉద్యోగాలు, ఉన్నత విద్య అభ్యసించే బాలికలకు స్కూటర్లు, ఐదు కొత్త వైద్య కళాశాలలు వంటి హామీలు ఇచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసేందుకు.. ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు భాజపా అధ్యక్షుడు నడ్డా తెలిపారు. వక్ఫ్ భూముల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు.. సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు.
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు.. ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం కోటాతోపాటు ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు నడ్డా తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు చేసిన నడ్డా.. అందులో దార్శనికత, పస రెండూ లేవన్నారు.