JP Nadda president elections: రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఈ ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా అధికార ఎన్డీఏలోని భాగస్వామ్యపక్షాలు, విపక్ష పార్టీలతో చర్చించే బాధ్యతను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. స్వతంత్రంగా ఉంటున్న వైకాపా, బీజేడీ వంటి పార్టీలతోనూ సంప్రదింపులు నడ్డా, రాజ్నాథ్ జరపనున్నారు. ప్రస్తుతం జేడీయూ, ఎల్జేపీ, అప్నాదళ్, అన్నాడీఎంకే, జేజేపీ, ఈశాన్య రాష్ట్ర పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్పీఫ్, ఏజీపీ పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
జులై 18న తేదీన రాష్ట్రపతి ఎన్నికను పోలింగ్ నిర్వహించనున్నట్లు, జూలై 21న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో పూర్తవనుంది. ఆయన 2017 జూలై 25న దేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.