JP Nadda Amit Shah Rajasthan Election Meet :రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్ నాయకత్వంతో రాత్రంతా మంతనాలు జరిపారు. దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఆలస్యంగా ప్రారంభమైన సమావేశం ఈ తెల్లవారుజామున 2 గంటల వరకూ సాగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇద్దరు కేంద్ర మంత్రులను అధిష్ఠానం కోరవచ్చనే ఊహాగానాల నడుమ సుధీర్ఘంగా చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో బీఎల్ సంతోష్ సహా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.
ఈ ఎంపీలను బరిలోకి!
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సహా కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జయపూర్ చేరుకున్న అమిత్ షా, నడ్డా విమానాశ్రయం సమీపంలోని ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించారు. తొలి 15 నిమిషాలు మాజీ సీఎం వసుంధరరాజేతో వారు చర్చించినట్లు సమాచారం. తర్వాత మిగిలిన నాయకులతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మెవాడ్, వాగడ్, సేఖావతి, హడౌతి, మార్‌వాడ్ ప్రాంతాల్లో మోహరించే అభ్యర్థులు, లోక్‌సభ ఎన్నికలపైనా చర్చించినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానమే సుప్రీం అని అంతా కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు అమిత్ షా, నడ్డా సందేశం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీఎం అభ్యర్థి లేకుండానే!
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కీలక నాయకులంతా కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ ఐక్యతే ప్రధానమని చాటేలా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.