తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సబ్సిడెన్సీ జోన్‌ పరిధిలో 'జోషీమఠ్‌'.. పగుళ్లు రావడం వెనుక అనేక కారణాలు' - జోషిమఠ్‌లో దెబ్బతిన్న భవనాల కూల్చివేత

జోషీమఠ్‌లో పగుళ్లు రావడం వెనుక ఎన్నో కారణాలున్నాయని, ఆ ప్రాంతమంతా సబ్సిడెన్సీ జోన్‌ పరిధిలో ఉందని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్‌ఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ రమన్‌చర్ల ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. తెలుగు వ్యక్తి అయినా ఆయన సీబీఆర్‌ఐకు సంచాలకుడిగా ఉన్నారు.

Etv Bharatjoshimath-under-subsidy-zone-demolition-of-damaged-buildings
Etv Bharatసబ్సిడెన్సీ జోన్‌ పరిధిలో జోషిమఠ్‌

By

Published : Jan 11, 2023, 8:41 AM IST

Updated : Jan 11, 2023, 8:58 AM IST

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ ప్రాంతం సబ్సిడెన్సీ జోన్‌ పరిధిలో ఉందని, పగుళ్లు రావడం వెనుక ఎన్నో కారణాలున్నాయని రూర్కీలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్‌ఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ రమన్‌చర్ల ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం జోషీమఠ్‌లో దెబ్బతిన్న భవనాల కూల్చివేత, పునరావాస చర్యల బాధ్యతను ప్రభుత్వం సీబీఆర్‌ఐకి అప్పగించింది. దీనికి తెలుగు వ్యక్తి ప్రదీప్‌కుమార్‌ సంచాలకుడిగా ఉన్నారు. అక్కడి పరిస్థితులపై ఆయన మాట్లాడారు.

జోషీమఠ్‌లో ఒక్కసారిగా భూమి, భవనాలలో పగుళ్లు రావడానికి కారణాలేంటి..?
ఈ ప్రాంతం సబ్సిడెన్సీ(మెల్లమెల్లగా కుదించుకుపోయే) జోన్‌ పరిధిలో ఉంది. వర్షాలతో కొండల్లోని పలచటి పొరల్లోకి నీరు చేరి పటుత్వం తగ్గుతోంది. హిమానీనదాలు కరగడంతో పాటు సహజసిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో భూమి గుల్లబారి కుదించుకుపోతోంది. ఇక్కడా ఈ అంశాలను కారణాలుగా చెప్పవచ్చు.

ఉత్తరాఖండ్‌లో ఎన్నో కొండ, లోయ, నది పరివాహక ప్రాంతాలున్నాయి. కేవలం జోషీమఠ్‌లోనే సమస్య ఎందుకు వచ్చింది..?
కొండ ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరగడం సాధారణమే. జనావాసాలు ఉండటంతో జోషీమఠ్‌పై అందరి దృష్టి పడింది. కొన్నేళ్లుగా అక్కడ ఆవాసాలు పెద్దఎత్తున వచ్చినా అదొక్కటే కారణమని చెప్పలేం. సమస్యకు మూలాలను గుర్తించే పనిలో ప్రభుత్వరంగ సంస్థలు నిమగ్నమయ్యాయి.

పగుళ్లు వచ్చిన ప్రాంతాలు, భవనాల గుర్తింపు ఎంతవరకు వచ్చింది?
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ సూచనతో సీబీఆర్‌ఐ తరఫున నేను, ముఖ్యశాస్త్రవేత్తలు కనుంగొ, అజయ్‌ చౌరసియా ఆ ప్రాంతాన్ని సందర్శించాం. కొన్ని భవనాలకు పగుళ్లు రాగా మరికొన్ని కుదించుకుపోయాయి. రెండు హోటళ్లు పూర్తిగా తొలగించాలి. మొత్తంగా 600 భవనాలపై ప్రభావం పడిందని అంచనా. అందులో 10-15 వెంటనే కూల్చివేసే స్థాయిలో ఉన్నాయి.

ఇతర నిర్మాణాలపై ప్రభావం లేకుండా పగుళ్లు వచ్చిన భవనాలను ఎలా తొలగిస్తారు..?
కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. ఒక హోటల్‌ను కూల్చివేసేందుకు మంగళవారమే మా బృందం అక్కడికి చేరుకుంది. పేలుడు రహిత సాంకేతికతతో హోటల్‌ను కూల్చివేయనున్నాం. దానివల్ల కొండ ఏటవాలు ప్రాంతంపై బరువు తగ్గి కింద ఉన్న నిర్మాణాలపై ఒత్తిడి తగ్గుతుంది. అనంతరం ఇళ్లపై ఎమర్జెన్సీ డ్యామేజ్‌ సర్వే చేసి తొలగించాల్సిన భవనాలను గుర్తిస్తాం. దశల వారీగా వచ్చే 15-20 రోజుల్లో వాటినీ తొలగిస్తాం.

బాధితుల పునరావాసానికి ఎలాంటి సాయం అందిస్తున్నారు..?
కొవిడ్‌ సమయంలో దేశవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో స్వల్ప సమయంలోనే తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి సాంకేతికతను సీబీఆర్‌ఐ అందించింది. మా వద్ద ఉన్న సాంకేతికతతో బాధితుల కోసం రెండు నెలల్లో తాత్కాలిక నివాసాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

Last Updated : Jan 11, 2023, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details