Joshimath Sinking: కాళ్ల కింద నేల కదిలిపోతున్నా, కళ్లెదుటే భవనాలు బీటలు వారుతున్నా ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ను వీడి వేరేచోటుకు రాబోమని స్థానికులు కరాఖండీగా చెబుతున్నారు. భూమిలో కదలికల వల్ల భవంతులు ప్రమాదకరంగా మారడంతో ప్రతిక్షణం విలువైనదేనని, శిబిరాలకు గాని, వేరే అద్దెఇళ్లకు గాని వెళ్లాలని అధికారులు చెబుతున్నా వారు ఒకపట్టాన వినడం లేదు. విచక్షణారహిత పనులతో తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, పుట్టిపెరిగిన ఊరుతో భావోద్వేగ బంధాన్ని తెంచుకుని ఎలా తరలివస్తామని ప్రశ్నిస్తున్నారు. శిబిరాలకు తరలివెళ్లినవారు వెనక్కి వస్తున్నారు. పైసాపైసా కూడబెట్టి సమకూర్చుకున్న గూడును ఎలా వీడిపోతామని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడికో వెళ్లే బదులు అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోతామని కొందరు స్థానికులు కన్నీళ్లతో చెబుతున్నారు.
ప్రమాదకర ఇళ్లపై ఎర్రరంగు గుర్తు
కొత్తగా మరో 68 ఇళ్లలో పగుళ్లు కనిపించడంతో ఇప్పటివరకు 678 నివాసాలు ప్రభావితమైనట్లయింది. వీటన్నింటిపై ఎర్రరంగు గుర్తులు వేసి, అవి నివాసయోగ్యం కావని హెచ్చరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 ఇళ్లకు వీటిని అంటించారు. రాబోయే ఆరు నెలల కాలానికి నెలకు రూ.4,000 అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ ప్రకారం వేరే ఇళ్లకైనా మారాలని ప్రజల్ని ఒప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.