ఉత్తరాఖండ్‌లో హిమనీనదం విస్పోటం తర్వాత ఆకస్మిక వరదలకు కారణాన్ని శోధించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. అయితే.. నందాదేవి శిఖరంపైఉందని భావిస్తున్న అణుపరికరమే జలవిలయానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టీ దానిపై మళ్లింది. తాజాగా ఉత్తరాఖండ్ పర్యటక మంత్రి సత్పాల్ మహారాజ్ ఈ విషయంపైనే మాట్లాడారు. 'గల్లంతైన అణుపరికరం ప్లుటోనియంను కనుగొనడానికి ప్రయత్నాల'ను మొదలుపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కొన్నేళ్ల క్రితం ఈ విషయంపై ప్రధానితో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్లుటోనియం జాడను కనుగొనడానికి ప్రధాని అప్పట్లో అంగీకరించినందున.. ప్రస్తుతం దీనిపై చర్యలు మొదలుపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్లుటోనియం కనుగొనే ప్రయత్నాలు మొదలుపెట్టండి ఎక్కడిది..?
1964లో చైనా.. షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఒక అణు బాంబును పరీక్షించింది.చైనా మరిన్ని అణు పరీక్షలు నిర్వహిస్తే పసిగట్టడానికి వీలుగా 1965లో అమెరికా గూఢచర్య సంస్థ 'సీఐఏ', భారత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్)తో కూడిన బృందం నందా దేవి హిమానీనదంపై ఒక రేడియో ధార్మిక పరికరాన్ని ఉంచింది. ఈ పరికరానికి ప్లుటోనియం క్యాప్సూళ్ల నుంచి శక్తి అందుతుంది. అవి దాదాపు వందేళ్లపాటు శక్తిని వెలువరిస్తాయి. ఆ తర్వాత దాని ఆచూకీ గల్లంతైంది. తాజా ఘటనకు ఈ పరికరం కూడా కారణమై ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పైవాఖ్యలు చేశారు.
నందాదేవి శిఖరంపై ఉన్న ప్లుటోనియంను అలాగే వదిలేస్తే రేడియేషన్ వెలువరుస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి మరిన్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని సత్పాల్ అభిప్రాయపడ్డారు. అధికారిక వివరాల ప్రకారం.. ప్లుటోనియం జాడ కోసం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలకు సూచించింది.
ఇదీ చదవండి:ఉత్తరాఖండ్ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు