Joshimath Landslide : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రటరీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులతో పాటు జోషీమఠ్ జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. జోషీమఠ్‌లో నెలకొన్న పరిస్థితులను ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి సుఖ్బీర్ సింగ్ సందు వివరించారు.
"ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జోషీమఠ్‌కు చేరుకున్నాయి. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. జోషీమఠ్‌లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిపుణులు సహకరిస్తున్నారు. బార్డర్ మేనేజ్మెంట్ సెక్రటరీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్ఎండీఏ) సభ్యులు సోమవారం ఉత్తరాఖండ్‌లో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తారు. ఎన్ఎండీఏ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటి రూర్కీ, వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ల నిపుణుల బృందం పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుంది."
--అధికారులు
అంతకుముందు.. ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో వందల సంఖ్యలో ఇళ్లు కుంగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.