Jos Alukkas Gold Robbery : తమిళనాడు కోయంబత్తూర్‌లోని గాంధీపురంలో పెద్ద ఎత్తున బంగారాన్ని లూటీ చేశారు దొంగలు. ప్రముఖ జువెలరీ సంస్థ జోస్ అలుక్కాస్ అండ్ సన్స్ దుకాణం నుంచి 1.200 కిలోల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, చోరీకి గురైన ఆభరణాల విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.
నిందితుడి కోసం స్పెషల్ టీమ్స్
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామును 2:30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ముసుగు ధరించి దుకాణంలోకి ప్రవేశించినట్లుగా దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. 'ఈ ఘటనలో ఇప్పటికే ఒక అనుమానితుడిని గుర్తించాము. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాము' అని కోయంబత్తూర్ పోలీస్ కమిషనర్ తిరు వి బాలకృష్ణన్ తెలిపారు. అయితే దొంగ దుకాణంలోని ఏసీ వెంటిలేషన్‌కు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడని సీపీ చెప్పారు. అపహరించిన వాటిలో వజ్రాభరణాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితుడి పాదముద్రలతో పాటు మరికొన్ని ఆధారాలను సేకరించినట్లు కమిషనర్ బాలకృష్ణన్ తెలిపారు. అయితే షాపు లోపల సెక్యూరిటీ సిబ్బందితో సహా 12 మంది ఉన్నా.. దొంగ లోపలికి ప్రవేశించడం గమనార్హం.
"ముసుగు వేసుకొని ఉన్న ఓ వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున గాంధీపురంలోని జోస్ అలుక్కాస్ షోరూమ్‌లో దొంగతనానికి పాల్పడ్డాడు. నాలుగు అంతస్తులు కలిగిన ఈ గోల్డ్ షాప్‌లోని మొదటి, రెండో అంతస్తుల్లో ఈ లూటీ జరిగింది. దుకాణంలోకి ప్రవేశించేందుకు ఎడమవైపున ఉన్న ఏసీ వెంటిలేటర్‌కు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించాడు. అపహరణకు గురైన ఆభరణాల విలువ ఎంతనేది ఇప్పుడే చెప్పలేము. విచారణ కొనసాగుతోంది. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాము."