తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీ గూటికి మాజీ సీఎం నల్లారి.. కేంద్ర కమిటీలో బాధ్యతలు..! - భారతీయ జనతా పార్టీలో చేరిన నల్లారి

NALLARI KIRANKUMAR JOINED IN BJP: ఆయనో మాజీ ముఖ్యమంత్రి.. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టారు. సరైన ఆదరణ లభించకపోవడంతో చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ కాంగ్రెస్​లో చేరినా.. ఎక్కువ కాలం కొనసాగలేదు.. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి.. కమలం పార్టీలో చేరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేరిక బీజేపీ ప్లస్​ అవుతుందని జాతీయస్థాయి నేతలు భావిస్తున్నారు. ఆయనను పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

NALLARI KIRANKUMAR JOINED IN BJP
NALLARI KIRANKUMAR JOINED IN BJP

By

Published : Apr 7, 2023, 12:59 PM IST

Updated : Apr 7, 2023, 1:43 PM IST

NALLARI KIRANKUMAR JOINED IN BJP: ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కమలదళంలో చేరారు. దిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటనకు ముందు బీజేపీలోకి నల్లారి చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 62 ఏళ్ల కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ సంబంధాలున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బీజేపీ అధిష్ఠానం నుంచి కీలక బాధ్యతల హామీతోనే ఆయన బీజేపీలోకి చేరేందుకు ముందుకొచ్చినట్లు అతని సన్నిహితుల సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్​ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌గా, శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో వైఎస్సార్​ మరణం తర్వాత 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి సీఎంగా కొనసాగారు.

2023 మార్చి 11న కాంగ్రెస్​కు రెండోసారి రాజీనామా:2014లో కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఆపై ఆపద్ధర్మ సీఎంగా కొన్నాళ్లు సేవలందించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టినా, ఎక్కడా గెలుపొందలేదు. ఘోర ఓటమితో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. 2018లో జై సమైక్యాంధ్ర పార్టీని రద్దు చేస్తూ మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సంవత్సరం మార్చి 11వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఏకవాక్యం ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. అంతకు ముందు నుంచే బీజేపీ నేతలతో కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరుపుతూ వస్తున్నారు.

పార్టీ కేంద్ర కమిటీలోనే నల్లారికి కీలక పదవి..!:రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా మీడియాలో కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా ఏళ్లపాటు ప్రతిరోజు ప్రచారంలో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా తమ బలం పెంచుకోవాలని భావిస్తోన్న బీజేపీ వివిధ రాజకీయ పార్టీల్లోని సీనియర్లను చేర్చుకునేందుకున్న ఏ అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. అందునా రాజకీయ అనుభవం, వివాదరహిత ముద్ర వేసుకున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలోనూ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయంగానే కాకుండా వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులతో సంబంధాలున్నాయి. ఈ బంధాలను బీజేపీకి లబ్ధి చేకూర్చేలా మరింత బలోపేతం చేయించే విధంగా నల్లారికి పార్టీ కేంద్ర కమిటీలోనే ఓ కీలకమైన హోదా ఇచ్చే అవకాశం ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో కిరణ్​ సేవలు ఉపయోగించే దిశగా బీజేపీ:మాజీ సీఎంను కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా దక్షిణాది రాష్ట్రాల పరిధిలో తన సేవలను వినియోగించుకునేలా చూడాలనేది పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ప్రధాని హైదరాబాద్‌ పర్యటన తర్వాత కిరణ్‌కుమారెడ్డికి పార్టీలో ఇచ్చే స్థానంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరేందుకు దిల్లీ వెళ్లిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. అంతకు ముందు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో మర్యాదపూర్వకంగా ఫోన్‌లో మాట్లాడారు.

ఓటు బ్యాంకును ఆకర్శించేందుకు బీజేపీ వ్యూహం:బీజేపీలోకికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికను ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు స్వాగతించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమైన నేతల సంఖ్య బీజేపీలో కొంత తక్కువ. ఈ పరిస్థితి ఏపీ, తెలంగాణల్లోనూ ఉంది. నల్లారిని చేర్చుకుని బలమైన లాబీయింగ్‌ నెర్పడం ద్వారా ఆ వర్గానికి చెందిన ఓటు బ్యాంకును ఆకర్షించడమే కాకుండా ముఖ్యులను పార్టీలో చేర్చుకునేందుకు ఓ మార్గం ఏర్పాటుకు వీలుంటుందని బీజేపీ జాతీయ నాయకత్వంలోని ముఖ్యులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా:1960 సెప్టెంబరు 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో కిరణ్​ జన్మించారు. హైదరాబాద్‌ నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో బీకాం, ఎల్ఎల్‌బీ చదివారు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. భార్య రాధికారెడ్డి. వీరికి కుమార్తె నీహారిక, కుమారుడు నిఖిలేష్ ఉన్నారు. హైదరాబాద్‌ తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లకు వికెట్‌ కీపర్‌గా ప్రాతినిధ్యం వహించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ప్రముఖులలో భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్, ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తన జట్టులో ఉన్నారు.

2016లో ముఖ్యమంత్రిగా పదవి:2010లో నవంబరు 25న 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి.. 2014 ఫిబ్రవరి 19 వరకు పదవిలో కొనసాగారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఉభయ రాష్ట్రాల మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి ఈయనకు స్నేహితులు. తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.

వరుస గెలుపులతో హ్యాట్రిక్​:1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచారు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టారు. రాజకీయంగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో సన్నిహితంగా ఉన్నారు. వైఎస్సార్​తో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 7, 2023, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details