భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా అవతరించేందుకు అవసరమైన పదేళ్ల రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత పెంచుకునేందుకు అంగీకారం తెలిపారు.
సమావేశంలో భాగంగా రెండు దేశాల మధ్య బిలియన్ పౌండ్లు విలువ చేసే భారీ వాణిజ్యం ఒప్పందానికి మోదీ, బోరిస్ అంగీకరించారు. ఇది అతిపెద్ద ప్రకటన అని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
భారత్‌తో బిలియన్ డాలర్ల ఒప్పందంతో తమ దేశంలో 6500 ఉద్యోగాలు సృష్టించవచ్చని బ్రిటన్ ప్రధాని అన్నారు. భేటీ అనతరం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో జీబీపీ 533 మిలియన్లు.. భారత్ నుంచి బ్రిటన్‌కు పెట్టుబడిగా వెళతాయి. ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నాయి. ఇందులో జీబీపీ 240 మిలియన్లు.. సీరం సంస్థ బ్రిటన్‌లో పెట్టుబడిగా పెట్టనుంది.