దేశంలో సింగిల్ డోసు టీకా అత్యవసర వినియోగానికి అనుమతించింది కేంద్రం. ఈ మేరకు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అనుమతులు జారీ చేసినట్లు ట్వీట్ చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. దీంతో దేశంలో మొత్తం 5 టీకాలు అత్యవసర వినియోగంలోకి వచ్చినట్లయిందని తెలిపారు.
సింగిల్ డోస్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి - అత్యవసర వినియోగం
13:30 August 07
సింగిల్ డోస్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
" భారత్ తన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచుకుంది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్-19 వ్యాక్సిన్ భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చాం. ప్రస్తుతం భారత్‌లో 5 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కొవిడ్ మహమ్మారిపై దేశ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది. "
- మాన్సుఖ్ మాండివియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
టీకా అనుమతి కోసం కేంద్రాన్ని సంప్రదించనున్నట్లు జాన్సన్ సంస్థ గత సోమవారం ప్రకటించగా.. అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు శుక్రవారం తెలిపింది. మరోవైపు సింగిల్స్ డోసు టీకా తయారీకి సంబంధించి.. భారత్‌కు చెందిన బయోలాజికల్-ఈతో జాన్సన్ అండ్ జాన్సన్ భాగస్వామిగా ఉంది. తమ సింగిల్ డోసు టీకా 85శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైందని జాన్సన్ తెలిపింది. టీకా పొందిన 28 రోజుల తర్వాత కరోనాతో ఆసుపత్రిలో చేరటం, మరణం వంటివి గుర్తించలేదని చెప్పింది.