కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లోనూ టీకా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుతున్నట్లు వెల్లడించింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.
66శాతం సమర్థత..
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ 66శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే తేలింది. తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు ఆ సంస్థ తెలిపింది. సింగిల్ డోసు వ్యాక్సిన్ ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44వేల మందిపై జరిపారు. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ 72శాతం, లాటిన్ అమెరికా దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లో 57శాతం సమర్థత కనబరిచిందని జే&జే ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్ మరణాల నుంచి వందశాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. భారత్‌లో విదేశీ టీకా అనుమతి పొందాలంటే మాత్రం ఇక్కడ తప్పనిసరిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే స్పుత్నిక్ ఇప్పటికే ప్రయోగాలు పూర్తిచేయగా తాజాగా జే&జే కూడా సిద్ధమవుతోంది.