దిల్లీ జవహర్ లాన్ నెహ్రూ యూనివర్సిటీలో రోజంతా కంప్యూటర్ ముందు గడిపే వినోద్ కుమార్ చౌదరి.. 9 గిన్నిస్ రికార్డులు నెలకొల్పారని అక్కడ ఉండే చాలా మందికి తెలియదు. టైపింగ్‌లో ఇప్పటికే 8 రికార్డులు సాధించిన ఈయన.. కరోనా కాలంలో విధించిన లాక్డౌన్లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2014లో ముక్కుతో అత్యంత వేగంగా టైపింగ్ చేసి తొలిసారి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన 41 ఏళ్ల వినోద్.. ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టుకుని ఓసారి, మౌత్ స్టిక్‌తో మరోసారి వేగంగా టైప్ చేసి రికార్డు సృష్టించారు. పేద పిల్లలు, దివ్యాంగుల కోసం తన ఇంట్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్లోని గోడలపై ఈ రికార్డుల పోస్టర్లే ఉంటాయి.
"నేను ఎప్పుడూ వేగంగా ఉండాలనుకుంటా. చిన్నతనంలో క్రీడల పట్ల అమితాసక్తి ఉండేది. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా క్రీడలను కొనసాగించలేకపోయా. అప్పుడే కంప్యూటర్ ముందు వేగంగా ఉండాలనే ఆసక్తి నాలో మొదలైంది. 2014లో ముక్కుతో 130 అక్షరాలను 46.30 సెకన్లలో టైప్ చేసి తొలిసారి గిన్నిస్ రికార్డు నెలకొల్పా. ఈ సర్టిఫికేట్ నాకు అందజేసిన తర్వాత నాలో స్ఫూర్తి మరింత పెరిగింది. అలాంటి రికార్డులు మరిన్ని నెలకొల్పాలనే కాంక్షతో సాధనకు ఎక్కువ సమయం కేటాయించాను. 2016లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించాను" అని వినోద్ చౌదరి తెలిపారు.
రికార్డులు..
- 2014లో ముక్కుతో అత్యంత వేగంగా టైప్ చేసి తొలి రికార్డు నెలకొల్పిన వినోద్.. 2016లో కళ్లకు గంతలు కట్టుకుని 6.71 సెకన్లలో ఆల్ఫాబెట్స్ అన్నీ టైప్ చేసి రెండో రికార్డు సృష్టించారు. అదే ఏడాది మరోసారి ఈ ఘనతను 6.09 సెకన్లలోనే సాధించి తన రికార్డును తానే తిరగరాశారు.
- 2017లో మౌత్ స్టిక్‌తో ఆల్ఫాబెట్స్‌ను 18.65 సెకన్లలోనే టైప్ చేసి మరోసారి రికార్డు సృష్టించారు. 2018లో 17.69 సెకన్లలోనే దీన్ని పూర్తి చేసి మరోసారి గిన్నిస్ బుక్‌లో చోటు సాధించారు. ఆ తర్వాత 2019లో 17.01 సెకన్లలోనే మౌత్ స్టిక్‌తో ఆల్ఫాబెట్స్ అన్నీ టైప్ చేసిన తన రికార్డులను తానే బద్దలు కొట్టారు.
- 2019లో ఒక్క వేలితోనే ఆల్ఫాబెట్స్‌ను 29.53 సెకన్లలో టైప్ చేసి మరో రికార్డు నెలకొల్పారు.