జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఉద్ధృతమైనట్లు బలగాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
" కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి. కానీ, జూన్ తొలివారం నుంచి ఆంక్షలు సడలించిన క్రమంలో.. మళ్లీ పెరిగాయి. 2021లో తొలి 5 నెలల్లో మొత్తం 40 ఘటనలు జరిగాయి. జూన్ 1 నుంచి జులై 22 వరకు ఇప్పటికే 34 ఘటనలు నమోదయ్యాయి. తప్పని పరిస్థితుల్లోనే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగిస్తున్నాం "
- సీనియర్ పోలీసు అధికారి.
62 ఘటనల్లో 129 మంది మృతి
ఈ ఏడాది ఇప్పటి వరకు 62 ఉగ్రవాదానికి సంబంధించి ఘటనలు జరగగా మొత్తం 129 మంది మరణించారు. అందులో 12 మంది పౌరులు, 19 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 98 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్క జులైలోనే 28 మంది ఉగ్రవాదులు మరణించారు. జూన్లో అత్యధికంగా ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది జరిగిన 62 ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో 32.. మే 1న కొవిడ్ కర్ఫ్యూ విధించిన తర్వాతే జరగటం గమనార్హం. గత ఏడాది మే నెలలో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్లో 48, జులైలో 20 మంది మృతి చెందారు. మొత్తంగా గత ఏడాదిలో 321 మంది మరణించారు. అందులో 232 మంది ఉగ్రవాదులు ఉన్నారు.
ఇదీ చూడండి:5 నెలల్లో 101 మంది ముష్కరులు హతం