Woman Murder Case Updates: వారిద్దరిది చిన్నప్పటి స్నేహం. ఫ్రెండ్‌కు కష్టం వచ్చిందని తెలుసుకుని భర్త సహాయంతో రూపాయి కాదు రెండు కాదు.. సుమారు 80లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చింది. అప్పు తీసుకున్న అతను చెడు వ్యసనాలకు బానిసై ఇచ్చిన డబ్బులు అడిగిన తన ప్రాణ స్నేహితురాలిని అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి..
జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, సుబ్బ లక్ష్మమ్మ దంపతుల కుమార్తె కోట రాధ(35). ఈమెకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోహన్‌రెడ్డితో వివాహమైంది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాధ బాల్య స్నేహితుడైన కేతిరెడ్డి కాశిరెడ్డి అలియాస్ చినకాశయ్య అప్పటికే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి కుటుంబ స్నేహితుడిగా మసిలేవాడు. హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తనకొక ప్రాజెక్టు ఆలోచన ఉందని.. అందుకు డబ్బు అవసరమని రాధ, మోహన్‌రెడ్డి దంపతులకు చెప్పాడు.
స్నేహధర్మంగా వారు రూ.80 లక్షల వరకు అప్పుగా ఇచ్చారు. అనంతరం అతను ఎంతకీ తిరిగివ్వక పోవడంతో జిల్లెళ్లపాడు నుంచి తన తల్లిదండ్రులు, బంధువులతోనూ రాధ అడిగించారు. అనేక సార్లు అతన్ని ఫోన్లో నిలదీశారు. అయినా లాభం లేకుండా పోయింది. చౌడేశ్వరి కొలుపులు ఉండటంతో ఈ నెల 11న తన చిన్నకుమారుడితో కలసి రాధ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు కనిగిరి వస్తే తన అనుచరులు వచ్చి కొంత నగదు ఇస్తారని ఈ నెల 17న ఆమెను నమ్మించాడు.
ఆ కారులో వచ్చిందెవరు..:డబ్బులు ఇస్తానని కాశిరెడ్డి మెసేజ్ పంపడంతో రాధ స్వగ్రామం నుంచి చిన్న కొడుకును తీసుకుని కనిగిరి చేరుకున్నారు. కుమారుడిని తన చిన్నాన్న ఇంటిలో వదిలి పామూరు బస్టాండు సెంటర్‌కు చేరుకుంది. సరిగ్గా సాయంత్రం 6.47 గంటల సమయంలో ఆ ప్రాంతానికి ఒక ఎరుపు రంగు కారు వచ్చి ఆగింది. అందులోని వ్యక్తులను చూసి ఆమె ఒకడుగు వెనక్కి వేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత పామూరు రోడ్డులోని గుజ్జుల యలమందారెడ్డి విగ్రహం వద్ద ఆమెను కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం దారుణంగా హింసించి హత్య చేశారు.
ఆ కారులో కాశిరెడ్డి ఉండి ఉంటాడని.. అపరిచిత వ్యక్తులు కూడా ఉండటంతో ఆమె సందేహించి వెనకడుగు వేసి ఉంటారని భావిస్తున్నారు. అయినప్పటికీ పట్టువిడవని కాశిరెడ్డి ఆమెను నమ్మించి తీసుకెళ్లి మట్టుబెట్టి ఉంటాడనే చర్చ సాగుతోంది. అసలు ఆ కారులో ఎవరెవరు ఉన్నారనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పామూరు బస్టాండ్ సెంటర్‌లో కనిపించిన ఆ కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యలో పాల్గొన్నవారు హైదరాబాద్ నుంచి వచ్చారా.? బెంగళూరు వారా..? స్థానికంగా ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.