ఝార్ఖండ్లో 18-44 ఏళ్ల వయసు వారికి ఉచిత టీకా పంపిణీ చేపట్టనున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 14 నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా మే 1న పంపిణీ చేపట్టలేకపోయినట్లు పేర్కొన్నారు.
" 18 ఏళ్లు పైబడిన వారికి మే 14 నుంచి టీకా అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వమే టీకాల ఖర్చు భరించి.. ఉచితంగా అందిస్తుంది. టీకాలు అందిన తీరును బట్టి అర్హత కలిగిన వారికి ఇస్తాం. "
- హేమంత్ సొరేన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి.
ఎలాంటి అసత్య వార్తలు నమ్మకుండా ప్రజలు ముందుకు వచ్చి ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలను కోరారు సీఎం. సంతల్ పరగనాస్, పలాము డివిజన్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొవిడ్ కట్టడి చర్యలను సమీక్షించారు.
50 లక్షల టీకా డోసుల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది ఝార్ఖండ్ ప్రభుత్వం. రాష్ట్రంలో 1.57 కోట్ల మంది ప్రజలు 18-44 ఏళ్ల వారు. ఇప్పటి వరకు 27.31 లక్షల మందికి టీకా తొలి డోసు ఇచ్చారు. 5.85 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు.
ఇదీ చూడండి:జెరూసలెంలో మళ్లీ ఘర్షణలు- అమెరికా ఆందోళన