Jharkhand Road Accident News Today : ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌లో చెట్టును వాహనం బలంగా ఢీకొట్టడం వల్ల ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు గాయపడ్డారు. వారంతా పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగ్మారా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల బంధువుల్లో ఒకరి నిఖా.. నవంబర్ 17వ తేదీ రాత్రి జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు జరిగింది. అది కూడా అయ్యాక.. మృతులు స్కార్పియోలో తోరియాకు బయలుదేరారు. బగ్మారా ప్రాంతానికి రాగానే డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పాయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వాహనం.. చెట్టును ఢీకొట్టింది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు గమనించి ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులకు సమాచారం అందించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను బయటకు తీశారు. ఇంతలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.