తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాంచీకి అధికార పక్షం ఎమ్మెల్యేలు.. ఉత్కంఠగా ఝార్ఖండ్​ రాజకీయం - ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌

ఝార్ఖండ్​ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సోమవారం విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఛత్తీస్​గఢ్​​ వెళ్లిన 30 మంది ఎమ్మెల్యేలు తిరిగి రాంచీకి చేరుకున్నారు. విశ్వాస పరీక్ష అనంతరం ఝార్ఖండ్​ రాజకీయాల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

Jharkhand MLAs return
jharkhand-mlas-return-to-ranchi-from-raipur-after-some-time

By

Published : Sep 4, 2022, 11:02 PM IST

ఝార్ఖండ్‌లో రాజకీయాల్లో గత పదిరోజులుగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని రిసార్టులో క్యాంపు వేసిన అధికార కూటమి (యూపీఏ) ఎమ్మెల్యేలు తాజాగా స్వరాష్ట్రానికి చేరుకున్నారు. రాయ్‌పుర్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఛార్టెడ్‌ విమానంలో 30మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాంచీకి చేరుకున్నారు. సోమవారం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభ సభ్యత్వంపై వేటు పడనుందని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపించినప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్‌ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారపక్షం ఆరోపిస్తోంది. ఆలస్యం చేస్తుందంటే అక్కడ ఏదో ప్లాన్‌ వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు యూపీఏ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అయితే, వారికి నెలకొన్న అనుమానాలకు త్వరలోనే స్పష్టత ఇస్తానన్న గవర్నర్‌ రమేష్‌ బైస్‌.. శుక్రవారం దిల్లీ వెళ్ళారు. రాజ్‌భవన్‌ వర్గాలు మాత్రం ఆయన వ్యక్తిగత పర్యటన మీద దిల్లీకి వెళ్లినట్లు పేర్కొన్నాయి.
యూపీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందనే అధికార కూటమి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌లోని రిసార్టుకు తరలించింది. తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతున్నందున రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది.

ABOUT THE AUTHOR

...view details